న్యాయ‌స్థానానికి, పోలీసుల‌కు జేసీ అగ్నిప‌రీక్ష‌!

న్యాయ‌స్థానానికి, పోలీస్ యంత్రాంగానికి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అగ్ని ప‌రీక్ష పెట్టారు.

న్యాయ‌స్థానానికి, పోలీస్ యంత్రాంగానికి తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అగ్ని ప‌రీక్ష పెట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ప్ప‌టి నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి అడుగు పెట్ట‌నివ్వ‌లేదు. తాడిప‌త్రికి కేతిరెడ్డి వెళ్లాల‌నుకున్నా, పోలీస్ యంత్రాంగం జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికే మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇలా 11 నెల‌ల కాలం గ‌డిచింది.

ఈ నేప‌థ్యంలో తాడిప‌త్రికి వెళ్లేందుకు అనుమ‌తి, ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఏపీ హైకోర్టును పెద్దారెడ్డి ఆశ్ర‌యించారు. ఆయ‌న‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువ‌రించింది. పెద్దారెడ్డి తాడిప‌త్రి వెళ్లేందుకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అనంత‌పురం ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. అయితే పెద్దారెడ్డి తాడిప‌త్రికి రానిచ్చే ప్ర‌శ్నే లేద‌ని ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌రోసారి తేల్చి చెప్పారు. ఒక‌వేళ తాడిప‌త్రికి వ‌చ్చి, ఎలా తిరిగి వెళ్తాడో చూస్తాన‌ని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీ హైకోర్టు స్ప‌ష్టంగా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించిన త‌ర్వాత కూడా, తాడిప‌త్రికి పెద్దారెడ్డి వెళ్లేందుకు స‌హ‌క‌రించ‌క‌పోతే, అది ముమ్మాటికీ పోలీస్ యంత్రాంగానికి అవ‌మానం. అలాగే హైకోర్టుకు కూడా ప్ర‌తిష్టాత్మ‌కం. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో త‌న ఆదేశాల్ని అధికార పార్టీ నాయ‌కుడు రౌడీయిజంతో అడ్డుకుంటున్నాడంటే, ఏపీ హైకోర్టు సీరియ‌స్‌గా తీసుకోవాల్సి వుంటుంది. లేదంటే న్యాయ వ్య‌వ‌స్థ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌నే మాట న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తోంది.

గ‌తంలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి వెళ్లి హ‌డావుడి చేశారు. అప్ప‌ట్లో పెద్దారెడ్డి వైఖ‌రిని చాలా మంది త‌ప్పు ప‌ట్టారు. రాజ‌కీయాల్లో విభేదాలుంటే ఎన్నిక‌ల్లో బ‌లాబ‌లాలు చూసుకోవాలి. అంతేకానీ, ఇలా అధికారంలో ఉన్నోళ్లు, లేనివాళ్ల స్వేచ్ఛ‌ను హ‌రించి వేస్తామంటే ఎలా కుదురుతుంది? తాడిప‌త్రికి వెళ్ల‌డం ఇప్పుడు పెద్దారెడ్డి కంటే, పోలీస్ యంత్రాంగం, అలాగే న్యాయ వ్య‌వ‌స్థ‌ల ప‌రువుప్ర‌తిష్ట‌ల‌కు ప‌రీక్ష అని చెప్ప‌క త‌ప్ప‌దు.

4 Replies to “న్యాయ‌స్థానానికి, పోలీసుల‌కు జేసీ అగ్నిప‌రీక్ష‌!”

  1. అవునా!!!రఘు రామ రాజు ని అయిదు ఏళ్ళు నియోజకవర్గం లో అడుపెట్టనియ్యకుండా చేసినప్పుడు గుర్తు లెవా ఈ నీతులు

  2. అవునా …రఘు రామ రాజు ని అయిదు ఏళ్ళు నియోజకవర్గం లో అడుపెట్టనియ్యకుండా చేసినప్పుడు గుర్తు లెవా ఈ నీతులు

Comments are closed.