ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల తనను ఆదరించాలని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండేది కాదు. కానీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు కేంద్రంగా, అది కూడా న్యాయ స్థానంలో విచారణ జరుగుతున్న అంశంపై తీవ్ర ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
ఒకవైపు న్యాయ స్థానంలో విచారణ జరుగుతుంటే, షర్మిల మాత్రం తన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి హంతకుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని వైఎస్ అభిమానులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. న్యాయ స్థానం తేల్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేసుకోవచ్చని, కానీ తానే తీర్పులివ్వడంపై నిరసన వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో దువ్వూరు ప్రచారంలో షర్మిల ఎదుట జై జగన్ అంటూ జనం నినదించడం ఆసక్తికర పరిణామం. దీంతో షర్మిల ఉక్రోశం పట్టలేకపోయారు. దమ్ము వుంటే తన వద్దకు వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్ విసిరారు. షర్మిల దృష్టిలో దమ్ము, ధైర్యం తనకు మాత్రమే సొంతమైన విషయాలనే విపరీత ధోరణి, ఇలాంటి సవాల్‌కు దారి తీసింది. షర్మిల ప్రచారం చేస్తున్న ప్రాంతంలో ఎవరికీ తనలా ధైర్యం లేదని ఆమె అనుకుంటున్నారా?
కేవలం వైఎస్సార్ బిడ్డగా, సీఎం జగన్ చెల్లిగా షర్మిలను ఇప్పటికీ అభిమానిస్తున్నారు. అంతే తప్ప, మరెవరైనా ఇలా నోరు పారేసుకుంటే, కడప ప్రజానీకం చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు. జగన్‌ను పైకి ఎంత విమర్శించినా, ఆమె ధైర్యం కూడా అతని చెల్లెలు కావడంతో ఎవరూ ఏమీ అనరని.
అయితే దువ్వూరులో ఆమె నిలదీత కేవలం ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో ఆమెను అడుగడుగునా నిలదీసే అవకాశాలే ఎక్కువ. మరీ ముఖ్యంగా మహిళలు ఆమెను నిలదీస్తారని కడపలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కూడా ఇట్లే అతి చేసి, ఆటలు సాగక ఆంధ్రాకు వచ్చారని నేరుగా ఆమె మొహం మీదే చెప్పగలిగే ధైర్యం కడప వాసులది.
రాజకీయంగా అవినాష్‌రెడ్డిపై ఎన్ని విమర్శలు చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ వ్యక్తిగత, నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం.. రానున్న రోజుల్లో అడుగడుగునా నిలదీతలు ఎదుర్కోడానికి షర్మిల సిద్ధంగా వుండాలి. రాజన్న బిడ్డనంటూ, చంద్రన్నకు రాజకీయ ప్రయోజనాలు కలిగించాలని అనుకుంటే, కడప గడ్డ చూస్తూ ఊరుకోదు.
కేవలం ఎన్నికల కోసం మాత్రమే వచ్చిన షర్మిల కడప పౌరుషాన్ని తనకు అన్వయించుకుంటుంటే, నిత్యం అదే నేలపై జీవిస్తూ, గాలి పీలుస్తున్న జనం ధమ్ము, ధైర్యం ఏంటో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ గుండెల్నే దమ్ము, ధైర్యం వుంటే వచ్చి మాట్లాడాలని సవాల్ విసురుతున్న షర్మిల అహంకారమే… ఎన్నికలు జరగకుండానే ఆమె అభాసుపాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కడపకు గెస్ట్ అయిన మీకే అంత పొగరంటే, ఆ గడ్డపై జీవించే వారికి ఇంకెంత వుండాలి? ఏదైనా వుంటే జగన్‌తో తేల్చుకో, అంతేకానీ, జనంతో పెట్టుకోవద్దు తల్లి. మరీ ముఖ్యంగా కడపోళ్లు మామూలోళ్లు కాదు.