రాబోయే సంవత్సరం దేవర నామ సంవత్సరంగా వుండబోతోందని లేదా వుండాలని దర్శకుడు త్రివిక్రమ్ ఆకాంక్షించేసారు.
ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు అంటే ఈ ఏప్రిల్ నుంచి వచ్చే ఏప్రిల్ వరకు.. దేవర నామ సంవత్సరం. వెయ్యి కోట్లు వసూళ్లు సాధించాలని కూడా ఆశీర్వదించారు. కానీ ఇదే సంవత్సరంలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కూడా విడుదల అవుతోంది. మరి దానికి ఏమని ఆశీర్వదిస్తారో గురూజీ?
పుష్ప 2 సినిమా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి తీరాల్సిన సినిమానే. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ నే 400 కోట్లకు పైగా వుంటుందని టాక్. మరి అది గుర్తు వుందో, లేదో, మొత్తానికి తన ఆశీస్సులు మాత్రం ‘దేవర’ కు అందించేసారు.
సరే, బన్నీ అంటే గురూజీతో మంచి స్నేహబంధాలు వున్న హీరో కనుక ఇలా ఆలోచించాల్సి వచ్చింది. గురూజీతో సినిమా ఇప్పటి వరకు చేయకపోయినా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ఈ ఏడాదిలోనే వస్తోంది. అది కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాల్సిన సినిమానే. అంతే కాదు ప్రభాస్ ప్రాజెక్ట్ కె, మెగాస్టార్ విశ్వంభర కూడా ఈ ఏడాదిలోనే. అవి కూడా పాన్ ఇండియా భారీ సినిమాలే. విశ్వంభర సంగతి అలావుంచితే ప్రాజెక్ట్ కె అన్నింటి కన్నా భారీ సినిమా. భారీ తారాగణం వున్న సినిమా.
అందువల్ల గురూజీ ఆశించినట్లు ఈ ఏడాది కేవలం దేవర నామ సంవత్సరమే కాదు.. పుష్ప 2 , ప్రాజెక్ట్ కె, గేమ్ చేంజర్ నామ సంవత్సరం కూడా.