ఏపీ బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ తన పార్టీకి చెందిన సీనియర్ నేతల్ని టార్గెట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై కన్నా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ క్రమశిక్షణ పద్ధతుల్ని కన్నా ఉల్లంఘిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సోము వీర్రాజు ఫిర్యాదు చేసినట్టు వార్తలొచ్చాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో కన్నా రెచ్చిపోతున్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై విమర్శలు గుప్పించడం గమనార్హం. కన్నా మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ ఏం సాధించారని కాపులు సన్మానాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జీవీఎల్ పార్లమెంట్‌లో అడిగిన సమాచారం గూగుల్‌లో వెతికినా వస్తుందని ఆయన వెటకరించారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు.
జనసేన పార్టీని బయట నుంచి ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాలని ఆయన కోరారు. జనసేనను అధికారంలోకి తీసుకురావడంపై పవన్‌కల్యాణ్ నిర్ణయానికి వదిలేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులకు రాజకీయ దిశా నిర్దేశం చేసే శక్తి తనలో లేదని కన్నా లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధిష్టానానికి పరీక్ష పెడుతున్నారు. తనపై చర్య తీసుకునే దమ్ము, ధైర్యం ఆ పార్టీకి వున్నాయో, లేదో నిరూపించడానికి అన్నట్టు సొంత పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థులను వెనకేసుకురావడం ఏపీ బీజేపీ నేతలకి ఆగ్రహం తెప్పిస్తోంది.
టీడీపీ లేదా జనసేన వైపు వెళ్లాలనే ఆలోచనలో కన్నా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే తనకు తానుగా వెళ్లకుండా, బీజేపీతో బయటికి నెట్టించుకోడానికే ఆయన ఇష్టపడుతున్నారు. రాజకీయంగా ఇది ఉపయోగపడుతుందని ఆయన భావన. జీవీఎల్‌పై తాజా విమర్శల నేపథ్యంలో ఏపీ బీజేపీ వైఖరి ఏంటనేది తెలియాల్సి వుంది.