నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తాను చేసిన తప్పేంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతూ వుంటుంది. అనవసరంగా లేని సమస్యని సృష్టించుకుని, తనకు తానుగా కష్టాల్లో పడ్డారు. అధికారాన్ని అనుభవించకుండా, ఏదో ఆశించి, ఊహించి సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు గుప్పించి అభాసుపాలయ్యారు. చివరికి కోటంరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని అతని ఆత్మీయుడు రామశివారెడ్డి లోకానికి చాటి చెప్పిన పరిస్థితి.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యేగా నిన్నమొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన నాయకుడు, నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును యాచించే పరిస్థితికి వచ్చారు. బాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దయనీయ స్థితిని కోరి నెత్తి మీదకి తెచ్చుకున్నారాయన. కోటంరెడ్డి రాజకీయంగా భిక్షమెత్తుకోవడాన్ని చూస్తూ… అయ్యో ఏంటీ ఖర్మ అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచి పోటీ చేయాలన్నదే తన ఆకాంక్ష అని మనసులో మాటను బయట పెట్టారు. చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో రారాజుగా బతికిన నాయకుడు ….ఇప్పుడు చంద్రబాబు కరుణ కోసం ఎదురు చూడడం కంటే శిక్ష మరొకటి వుంటుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలో కోటంరెడ్డికి వచ్చిన ఇబ్బందులేంటనే చర్చ జరుగుతోంది. కోటంరెడ్డి తనకు తాను ఎక్కువ ఊహించుకుని సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారంటున్నారు. నోరు జారితే పరిణామాలు ఎలా వుంటాయో కోటంరెడ్డికి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పలుమార్లు కోటంరెడ్డి ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నట్టు వార్తలొచ్చినా, చంద్రబాబు, లోకేశ్, నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కనీసం స్పందించడం లేదని గుర్తు చేస్తున్నారు. ఇంతకంటే అవమానం వైసీపీలో జరిగిందా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఆదరించి అక్కున చేర్చుకున్న జగన్‌ను వెన్నుపోటు పొడిచిన కోటంరెడ్డి పాపం పండుతోందనే వాళ్లు లేకపోలేదు.