మంత్రి జోగి రమేశ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు పీక్‌కు చేరింది. మంత్రి పదవి వచ్చిన తర్వాత మైలవరంలో పట్టు నిలుపుకునేందుకు జోగి రమేశ్ దూకుడు ప్రదర్శించారు. ఇది కాస్త వికటించింది. వైసీపీలో తీవ్ర విభేదాలకు దారి తీసింది. సీఎం జగన్ అండ చూసుకునే జోగి రమేశ్ రెచ్చిపోతున్నారని మైలవరం ఎమ్మెల్యే ఆవేదన, ఆక్రోశం. ఈ నేపథ్యంలో తనకు సంబంధం లేకుండానే మైలవరం నియోజకవర్గంలో నిర్ణయాలు జరిగిపోతుంటే, తాను ఎందుకనే భావనతో వసంత కృష్ణప్రసాద్ అలకబూనడం తెలిసిందే.
దీంతో జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఆపేశారు. ఈ పరిణామాల మధ్య వసంత కృష్ణప్రసాద్‌ను సీఎం జగన్ గురువారం పిలిపించుకుని మాట్లాడారు. తన వెంట 25, 30 ఏళ్లు నడిచేందుకు సిద్ధంగా ఉండాలని, ఏదైనా సమస్య వుంటే చెప్పాలని సర్ది చెప్పి పంపారు. మైలవరం టికెట్ మళ్లీ వసంత కృష్ణప్రసాద్‌కే అని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మంత్రి జోగి రమేశ్‌కు తనదైన స్టైల్‌లో లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మంత్రి జోగి రమేశ్ వ్యవహారం వల్లే మైలవరం నియోజకవర్గంలో సమస్యలొచ్చాయన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావాలని సీఎం జగన్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఇతరుల నియోజక వర్గాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. కానీ తన నియోజకవర్గంలో వేలు పెడితే మాత్రం సహించేది లేదని ఆయన ఘాటు హెచ్చరిక చేయడం గమనార్హం.
మైలవరంలో విభేదాల అంశం తన వరకూ రాలేదని సీఎం అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తన వరకూ సమస్య రాకుండానే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేయడం సరైంది కాదని తనతో జగన్ అన్నట్టు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సీఎంతో భేటీ తర్వాత వసంత కృష్ణప్రసాద్‌లో ఓ భరోసా కనిపించింది. ఇక మీదట మంత్రి జోగి రమేశ్ జోక్యం చేసుకుంటే మాత్రం… మైలవరంలో ప్రతిఘటన తప్పదనే సంకేతాల్ని ఆయన నేరుగా పంపారు.