జబర్దస్త్ కామెడీ షోలో మంత్రి రోజా తెచ్చి పెట్టుకునే నవ్వు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతులతో కూడిన ఆ షోలో ఒక మహిళా ప్రజాప్రతినిధిగా పాల్గొనడం ఏంటని అనేక మార్లు నిలదీతకు రోజా గురయ్యారు. సినీ నేపథ్యం ఉన్న తాను ఇలాంటి షోలో పాల్గొనక తప్పనిసరి పరిస్థితి ఉందని, ఆదాయం మార్గంగా కూడా ఆమె చెప్పుకొచ్చారు. మంత్రి అయిన తర్వాత ఆ కామెడీ & ద్వంద్వార్థాల షో నుంచి రోజా తప్పుకున్న సంగతి తెలిసిందే.
నిన్న మొన్నటి వరకూ షోలో అలరించిన ఆర్కే రోజా…. దాంతో లోకేశ్ పాదయాత్రను పోల్చడం గమనార్హం. లోకేశ్ వర్సెస్ రోజా, పవన్‌కల్యాణ్ వర్సెస్ రోజా టీవీ సీరియల్‌లా నడుస్తున్న సంగతి తెలిసిందే. రోజాను డైమండ్ రాణితో పవన్ పోల్చడం, అదే వెటకారాన్ని లోకేశ్ కూడా కొనసాగిస్తున్నారు. లోకేశ్‌ను అంకుల్ అని పిలుస్తానని రోజా కౌంటర్ ఇచ్చారు. ఏపీ రాజకీయాల్లో లోకేశ్ పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది.
లోకేశ్ పాదయాత్రపై రోజా సెటైర్లు విసిరారు. మీడియాతో రోజా మాట్లాడుతూ లోకేశ్ పాదయాత్ర కాస్త రోజురోజుకి జోకేశ్ పాద యాత్రలా సాగుతోందన్నారు. ఈ పాదయాత్ర సాగుతూ సాగుతూ జబర్దస్త్‌కి పోటీగా నిలబడుతోందని వ్యంగ్య బాణాలు విసిరారు. చంద్రబాబుకు చివరి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రజలకి ఇవే చివరి రోజులవుతాయని రోజా హెచ్చరించడం గమనార్హం.
ఒక పక్క వయోవృద్ధుడు, మరోపక్క అసమర్థుడితో తెలుగుదేశం పార్టీ నలిగిపోతోంది అంటూ చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు ఆమె విమర్శలు గుప్పించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు వృద్ధాప్యాన్ని ప్రధానంగా వైసీపీ వ్యూహాత్మకంగా తెరపైకి తేవడాన్ని గమనించొచ్చు. ముసలాయన అంటూ ఇటీవల సీఎం జగన్ సరికొత్తగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేశ్ పాదయాత్రలో తన సత్తాను చాటుకోలేకపోవడం టీడీపీకి మైనస్ అవుతోంది. ఇవన్నీ అధికార పక్షానికి ఆయుధాలు అవుతున్నాయి.