ఏపీ బీజేపీలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎపిసోడ్ చిచ్చు రగిల్చింది. బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు… తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బయటపడ్డాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ విమర్శలకు దిగారు. తమ నుంచి పవన్‌కల్యాణ్ దూరం కావడానికి సోము వీర్రాజే కారణమని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు మంచిగా డీల్ చేసి వుంటే పవన్ టీడీపీ వైపు వెళ్లేపోయేవారు కాదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో అంటకాగడాన్ని వీర్రాజు తీవ్రస్థాయిలో విభేదిస్తున్న సంగతి తెలిసిందే. ఇది బీజేపీలోని టీడీపీ కోవర్టులకు ఎంత మాత్రం జీర్ణం కావడం లేదు. ఏపీ బీజేపీ చీఫ్‌గా వీర్రాజు వుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే వుండదని కోవర్టులంతా ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వీర్రాజును తప్పించడానికి పవన్ పక్క చూపులను సాకుగా చూపిస్తున్నారు.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, వీర్రాజు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం ఇద్దరి మధ్య అంతర్గతంగా సాగుతున్న పోరు, పవన్ ఎపిసోడ్‌తో బట్టబయలైంది. వీర్రాజుపై బహిరంగంగానే కన్నా లక్ష్మినారాయణ ఫైర్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీర్రాజుపై కన్నా తన అక్కసును వెళ్లగక్కారు.
బీజేపీని దాదాపు వీడి, టీడీపీతో పవన్ జత కట్టడాన్ని ఎలా చూస్తారనే ప్రశ్నకు కన్నా తనదైన రీతిలో సోము వీర్రాజుపై నెపాన్ని నెట్టారు. పవన్‌కల్యాణ్‌ను సమన్వయపరచుకోవడంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందన్నారు. వీర్రాజు వైఖరి వల్లే పవన్ బీజేపీకి దూరమయ్యారని ఆయన నేరుగానే చెప్పారు. సమస్య అంతా వీర్రాజుతోనే అని ఆయన కుండబద్దలు కొట్టినట్టు విమర్శించారు.
బీజేపీలో ఏం జరుగుతున్నదో తమకే తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ వ్యవహారాలన్నీ సోము వీర్రాజు ఒక్కడే చూసుకుంటుండడంతో సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని తాను చెప్పలేనని, అది జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలనే పిలుపు ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని మనసులో మాటను కన్నా లక్ష్మినారాయణ పరోక్షంగా బయట పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు ఉండనే ఉండదని వీర్రాజు చెబుతుండడాన్ని ఆయన పరోక్షంగా ఖండించినట్టైంది. వీర్రాజుపై కన్నా అండ్ కో ఆగ్రహానికి కారణాలేంటో తాజా విమర్శలే తెలియజేస్తున్నాయి. మొత్తానికి బీజేపీలో టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వైరం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని చెప్పక తప్పదు. పవన్‌ను అడ్డు పెట్టుకుని వీర్రాజుపై ఘాటు విమర్శలు చేసే అవకాశాలున్నాయి.