రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎప్పటికీ టు కాదని అంటున్నారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తెలుగుదేశం, జనసేనల పొత్తు గురించి కేతిరెడ్డి ఈ కామెంట్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రంగా విరుచుకుపడిన కేతిరెడ్డి .. తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుంటే వాటికి గత ఎన్నికల్లో లభించిన ఓట్ల శాతం అంతా ఒకటైపోతుందని అనుకోవడం భ్రమ అని కేతిరెడ్డి విశ్లేషించారు. దీనికి ఆయన పలు ఉదాహరణలను కూడా ప్రస్తావించడం గమనార్హం.
తన బావమరిది ఎమ్మెల్యేగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం గురించి కేతిరెడ్డి ముందుగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజకీయ వైరాన్ని నెరిపిన ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున పని చేసిన విషయాన్ని కేతిరెడ్డి ప్రస్తావించారు. రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున, ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల తరఫున చాలా కాలం పాటు తీవ్ర విరోధంతో తలపడ్డారు.
అయితే ఆది తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. వారికి చంద్రబాబే రాజీ చేశారు. మరి జమ్మలమడుగులో రెండు మూడు శాతం ఓట్ల తేడా మాత్రమే కలిగి, రెండే ప్రధాన వర్గాలుగా దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఆది, రామసుబ్బారెడ్డిల కలయికతో తెలుగుదేశం గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గాల్సిందని, అయితే ఆది, రామసుబ్బారెడ్డిలు కలసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డికి యాభై వేల స్థాయి మెజారిటీ వచ్చిన వైనాన్ని కేతిరెడ్డి ప్రస్తావించారు.
కేవలం జమ్మలమడుగే కాదు.. కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు రాజీ చేసిన విషయాన్ని కేతిరెడ్డి ప్రస్తావించారు. దశాబ్దాలుగా రాజకీయ వైరం నడిపిన కోట్ల, కేఈ కుటుంబాలను కలిపి చంద్రబాబు నాయుడు రాజకీయం చేశారని.. వారికి రాజీ చేశారని, అయితే ఆ రెండు కుటుంబాలూ చిత్తయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని కేతిరెడ్డి ప్రస్తావించారు.
ఈ ఉదాహరణే కాదు.. విజయనగరం జిల్లా రాజుల గురించి కూడా కేతిరెడ్డి ప్రస్తావించారు. బొబ్బిలి, పూసపాటి రాజుల రాజకీయ వైరం శతాబ్దాలది అని, వారిని కూడా కలిపి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో పోటీ చేయించారని, అయితే ఆ రెండు రాజ కుటుంబాలు వైరాన్ని పక్కన పెట్టి ఒక్కటై ఇద్దరూ ఓటమి పాలయ్యారని కేతిరెడ్డి ప్రస్తావించారు.
జమ్మలమడుగు, కర్నూలు, విజయనగరం జిల్లా.. ఇలా గత ఎన్నికల్లోనే చంద్రబాబు నాయుడు వన్ ప్లస్ వన్ రాజకీయం చేశారని, అయితే ఎక్కడా అది వర్కవుట్ కాలేదని అందుకే రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ టు అవుతుందనుకోవడం భ్రమ అని కేతిరెడ్డి విశ్లేషించారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల కలయిక కూడా అలాంటిదే అవుతుందని కేతిరెడ్డి అంటున్నారు.