కమలకిరణం: జోగీజోగీ రాసుకుంటే..

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందని సామెత! ఈ సామెత ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏపీ రాజకీయాలకు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుందని అనిపిస్తోంది. తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ…

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుందని సామెత! ఈ సామెత ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏపీ రాజకీయాలకు అచ్చు గుద్దినట్లుగా సరిపోతుందని అనిపిస్తోంది. తాజా హాట్ టాపిక్ ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గే కు పంపారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో ఆల్రెడీ సంప్రదింపులు పూర్తి చేశారని, నేడో రేపో నల్లారి కిరణ్ బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిణామం చాలా తమాషాగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా మాత్రమే ఉండాలని సమైక్యాంధ్రకు అనుకూలంగా చివరికంటా పోరాడిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన జనం మీద ప్రభావం చూపగలిగే నాయకుడూ కాదు, ప్రభుత్వం మీద పట్టున్న ముఖ్యమంత్రీ కాదు. కానీ.. మొత్తానికి సమైక్యాంధ్ర చాలా గట్టిగా ప్రయత్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బెర్లిన్ గోడను కూలగట్టిన ఉదాహరణ చెప్పి, ఓ ఇటుక చూపించి.. రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కథలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. 

అలాంటిది.. అసలు తెలంగాణ డిమాండ్ బలపడడానికంటెముందునుంచి, రాష్ట్రాన్ని చీల్చడానికి కంకణం కట్టుకుని పనిచేసిన, చిన్న రాష్ట్రాలే మేలు అనే కాన్సెప్ట్ ప్రవచిస్తూ వచ్చిన, అలాగే రాష్ట్ర విభజనకు సంపూర్ణంగా సహకరించిన బిజెపిలో చేరడం అనేది అనూహ్యమైనసంగతి. కేవలం రాష్ట్రవిభజనకు కారణమైన పార్టీ అని మాత్రమే కాదు, విభజన తర్వాత కూడా ప్రత్యేకహోదా వంటి.. రాష్ట్రానికి ఉపయోగపడగల ఏ హామీని కూడా నెరవేర్చకుండా వంచించిన పార్టీలో కిరణ్ చేరి ఏం సాధించాలని అనుకుంటున్నారో తెలియదు. 

అయినా ఈ ఇద్దరూ కలిసినంత మాత్రాన జోగీ జోగీ రాసుకుంటూ బూడిద రాలుతున్నట్టే ఉంటుంది గానీ.. ఇంకో ప్రయోజనం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ బిజెపి. చెప్పు గుర్తుతో సమైక్యాంధ్ర పార్టీ పెట్టి రాష్ట్రంలో ఒక్కచోట కూడా గెలవకుండా అపారమైన పరాభవాన్ని మూటగట్టుకున్న నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. 2014 నుంచి ఆయన బలమూ, 2019 నుంచి బిజెపి బలమూ ఇప్పటిదాకా రాష్ట్రంలో ఏ కొంచెంమూ పెరగలేదనదే పలువురి భావన. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఏం సాధిస్తారో చూడాలి.