మోడీ పరువు తీయడానికి ఇలాంటోళ్లు చాలు!

ధర్మపురి అర్వింద్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ అధినేత కేసీఆర్ తుల్యమైన తెలంగాణ యాసలో, మొరటు బూతు, నీచమైన సామెతలు ఉపయోగిస్తూ తన ప్రత్యర్థి పార్టీలను…

ధర్మపురి అర్వింద్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ అధినేత కేసీఆర్ తుల్యమైన తెలంగాణ యాసలో, మొరటు బూతు, నీచమైన సామెతలు ఉపయోగిస్తూ తన ప్రత్యర్థి పార్టీలను తూలనాడుతూ ఉంటే.. అంతకు మించి, ఆయనకు దీటుగా సామెతలూ లేకి భాష ఉపయోగిస్తూ భారాసను తిట్టగల బిజెపి నాయకుడు ఆయన. అలాగే ఆయనకు గుర్తింపు ఎక్కువ. అలాంటి ధర్మపురి అర్వింద్ ఇప్పుడు కమలదళాన్ని ఇరకాటంలోకి నెట్టే పని చేస్తున్నారు. అర్వింద్ మాటలను జాగ్రత్తగా గమనిస్తే.. ఎవ్వరికైనా సరే వంద అనుమానాలు పుడతాయి. ఆ అనుమానాలన్నీ కూడా మోడీ మీదనే పుడతాయి. 

కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు వెళ్లి వచ్చారు. అంతవరకు ఓకే. కానీ ఈడీ విచారణలో ఏం జరిగింది? ఏం చెప్పారు? ఏం రికార్డు అయింది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. విచారణ అంటే.. అటు ఈడీ అధికారులు, ఇటు కవిత మాత్రమే ఉంటారనేది మనకు తెలిసిన సంగతి. కవిత తన లాయరుతో కలిసి విచారణకు హాజరవుతానని అడిగినప్పటికీ ఈడీ ఒప్పుకోలేదు. కవితతో పాటు అక్కడిదాకా వెళ్లిన లాయరు, ఆమె భర్త ఇద్దరూ ఆమె లోపలకు వెళ్లగానే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. కవిత ఒక్కటే ఈడీ విచారణలో ఉన్నారు.

మరి అలాంటప్పుడు లోపల ఏం జరిగింది అనేది కవిత చెప్పాలి.. లేదా, ఈడీ అధికారులు చెప్పాలి. కవిత ఎటూ అర్ధరాత్రి ఇంటికొచ్చి నాన్నతో తన గోడు మొత్తం చెప్పుకున్నారు. అదంతా వేరే పర్వం. 

మరి ధర్మపురి అర్వింద్ కు లోపల ఏం జరిగిందనే సంగతి ఎవరు చెప్పారు. కవిత విచారణకు సహకరించలేదని, ఏం అడిగినా సరే.. తెలియదు, మర్చిపోయాని వంటి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తున్నదని అర్వింద్ చాలా వెటకారాత్మక డైలాగులు వేశారు. ఆమె సహకరించారో లేదో ఆయనకు ఎలా తెలిసింది. ఈడీ అధికారులు చెబితే తప్ప తెలిసే వివరాలు కాదు కదా అవి. పైగా, రామచంద్ర పిళ్లై మీద కేసీఆర్, కవిత కల్సి ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకున్నట్టుగా తెలిసిందని అరవింద్ అంటున్నారు. పిళ్లై ఏమీ చిన్న పోరడు కాదు కదా.. తెలియక మాట్లాడి ఉండడం జరగదు కదా అని తన ఊహల్ని జత చేస్తున్నారు. 

అసలే ఈడీ, సీబీఐ సహా దర్యాప్తు సంస్థలు మోడీ, బీజెపీ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని అనేక విమర్శలున్నాయి. ‘ఈడీ విచారణలో ఇలా జరిగింది..’ అంటూ ఆ పార్టీ ఎంపీ అర్వింద్ వివరాలు వెల్లడిస్తే ఈ ఆరోపణలన్నీ నిజమే అనుకోవాల్సి వస్తుంది. ఒక మామూలు బిజెపి ఎంపీ అర్వింద్ కే, ఎంతో రహస్యమైన ఈడీ విచారణ వివరాలు పూసగుచ్చినట్టుగా తెలిసిపోయాయంటే.. ఇక సాక్షాత్తూ దేశప్రధాని డైరక్షన్ లోనే ఈడీ పనిచేస్తూ ఉంటుందని ప్రజలు నమ్మడంలో వింతేముంది.