ముఖ్యమంత్రి జగన్ ఎవరికి ఏ విధంగా వరాలు ఇస్తారు అన్నది అంతుబట్టదు. ఆయన కోరి మరీ పిలిచి పెద్ద పీట వేస్తారు. ఉన్నత పదవులు ఇస్తారు. అలా కనీసం ఊహాగానాలలో కూడా పేరు లేని విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఏపీ ఫిషరీస్ బోర్డు చైర్మన్ కోలా గురువులుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.
దాంతో ఆయన వర్గం ఆనందం చెప్పడానికే వీలు లేకుండా ఉంది. ఆరేళ్ళ పాటు పెద్దల సభలో కోలా గురువులు తన గొంతుని వినిపించబోతున్నారు. ఉత్తరాంధ్రాలో పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకార సామాజికవర్గానికి ఈ అవకాశం ఇదే తొలిసారి. ఈ పరిణామంతో కోలా గురువులు పట్ల వైసీపీ అధినాయకత్వం చూపిస్తున్న ప్రేమాభిమానాలను చూసిన వారు లక్కీ గురువులు అంటున్నారు.
ఈ సంతోషం ఇలా ఉండగానే మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రలోని మత్స్యకార వర్గానికి మంత్రి పదవి దక్కింది. అలా మొదటి అవకాశాన్ని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన సీదరి అప్పలరాజు అందుకున్నారు. ఇపుడు ఆయనకు బదులుగా కోలా గురువులుని అదే పదవిలో కూర్చోబెడతారు అన్న ప్రచారం సాగుతోంది.
కోలాగురువులు వైసీపీలో సీనియర్ నేత. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు. మత్యకార వర్గంలో ఆయన కీలక నేత. అలా సామాజికవర్గం పరంగా చూస్తే ఆయనకు అది ప్లస్ పాయింట్ అవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో విశాఖ జిల్లాకు మంత్రి పదవి అన్నది లేకుండా పోయింది. దీని మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారు అప్పట్లోనే కామెంట్స్ చేశారు.
విశాఖ మీద ప్రేమ ఉందని చెబుతున్న ప్రభుత్వం మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని ప్రతిపక్షం విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు కోలా గురువులును మంత్రిగా చేసి కొత్త జిల్లాకు ఆ లోటు లేకుండా చూడాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అదే కనుక జరిగితే కోలా గురువులుకు డబుల్ జాక్ పాట్ దక్కినట్లే అంటున్నారు. ఎమ్మెల్యే కావాలని ఒకనాడు ఎంతో తపన పడిన ఆయనకు ఇపుడు పెద్దల సభలోనే చాన్స్ ఇచ్చిన వైసీపీ మినిస్టర్ ని కూడా చేస్తే మాత్రం అది తట్టుకోలేని సర్ప్రైజ్ అవుతుందని అంటున్నారు. విశాఖ మీద రాజకీయంగా గురి పెట్టిన వైసీపీ గురువులుని మంత్రిని చేసినా చేయవచ్చు అన్నది వినిపిస్తున్న మాట.