కరోనా భయం.. మూడేళ్లుగా చీకట్లో మగ్గిన కుటుంబం

తెలియని మానసిక సమస్యలు చుట్టుముడితే ఇంట్లో ఉండిపోతారు. ఎవ్వరితో కలవరు. ఏకంగా మూడేళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఓ కుటుంబం ఇప్పుడు ప్రపంచాన్ని చూసింది. మూడేళ్లుగా వారు చీకటి గదిలో మగ్గిపోయారు. చివరకు భర్తను…

తెలియని మానసిక సమస్యలు చుట్టుముడితే ఇంట్లో ఉండిపోతారు. ఎవ్వరితో కలవరు. ఏకంగా మూడేళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఓ కుటుంబం ఇప్పుడు ప్రపంచాన్ని చూసింది. మూడేళ్లుగా వారు చీకటి గదిలో మగ్గిపోయారు. చివరకు భర్తను కూడా దగ్గరకు రానీయలేదు ఆ భార్య. పదేళ్ల కొడుకుతో పాటు తాను కూడా ఆ ఇంటిలోనే ఉండిపోయింది.

గుర్గావ్ లో సుజన్ మాఝీ అనే వ్యక్తి ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 2020లో తొలి లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఆ కుటుంబం ఇంటికే పరిమితమైంది. ఆంక్షలు సడలించిన తర్వాత సుజన్‌ ఆఫీసుకెళ్లడం మొదలు పెట్టాడు. అయితే ఆఫీసుకి వెళ్లొచ్చిన తర్వాత సుజన్ ను భార్య ఇంటిలోకి రానివ్వలేదు.

దీంతో అతడు బయటే ఉన్నాడు, అలా 2 రోజులపాటు బయట నుంచి బయటకే ఆఫీస్ కి వెళ్లొచ్చాడు. అయినా భార్య కనికరించలేదు. చేసేదేం లేక కొన్నిరోజులు స్నేహితుల ఇంటిలో తలదాచుకున్నాడు. భార్యని బతిమిలాడితే బట్టలు, అతడి వస్తువులు బయటకు విసిరేసింది. వాటిని తీసుకుని చివరకు అదే ఏరియాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు సుజన్.

భర్తే అన్నీ సమకూర్చేవాడు..

భర్త విడిగా ఉంటున్నా.. భార్య, బిడ్డ బాగోగులు చూసుకునేవాడు. రోజూ ఆ ఇంటికి పాలప్యాకెట్లు వేయడం, ఇతర సరకులు అందించడం, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు కట్టడం, పిల్లవాడికి స్కూల్ డిస్ కంటిన్యూ కాకుండా ఫీజు చెల్లించి ఆన్ లైన్ క్లాసులకు అనుమతి తీసుకోవడం.. ఇలా వ్యవహారమంతా బాగానే జరిగింది.

కానీ భార్య మాత్రం భర్తను ఇంటిలోకి రానీయలేదు. కొడుకుని కనీసం సూర్యోదయాన్ని కూడా చూడకుండా గదిలోనే ఉంచేసింది. తాను మాత్రం గేటు దగ్గరకు వచ్చి కూరగాయలు, పాలు ఇంటిలోకి తీసుకెళ్లేది. ఇక ప్రతిరోజూ భార్య, కొడుకుతో సుజన్ వీడియో కాల్ మాట్లాడేవాడు. కరోనా భయం తగ్గిపోయింది, ప్రపంచమంతా తిరిగి మామూలు స్థితికి వచ్చిందని ఎంత చెప్పినా కూడా ఆమె వినలేదు. తన కొడుక్కి కరోనా సోకకూడదు అనే అతి జాగ్రత్తతో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైంది.

చివరికిలా..?

అయితే వారిని ఇలాగే వదిలేస్తే మానసిక సమస్యగా ముదిరిపోతుందనే భయంతో సుజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కూడా మొదట నమ్మలేదు కానీ, రోజూ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, ఇంటికి సరకులు పంపించడం వంటివాటిని నేరుగా చూసేసరికి విషయం అర్థమైంది. వైద్య సిబ్బంది సాయంతో ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి సుజన్ భార్య, కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికి మానసిక వైద్యుల సాయంతో చికిత్స అందిస్తున్నారు.