జ‌గ‌న్‌ను బోల్తా కొట్టించిన కోటంరెడ్డి

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అదే పార్టీకి చెందిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి న‌మ్మించి బోల్తా కొట్టించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ , కోటంరెడ్డి ఎందుకో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.…

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను అదే పార్టీకి చెందిన నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి న‌మ్మించి బోల్తా కొట్టించారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ , కోటంరెడ్డి ఎందుకో తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. కానీ మొద‌టి నుంచి ఆయ‌న వైఎస్ కుటుంబానికి విధేయుడ‌నే వాస్త‌వాన్ని విస్మ‌రించ‌కూడ‌దు. అయితే నెల్లూరు వైసీపీలో వ‌ర్గ విభేదాలు, త‌న‌కు గిట్ట‌ని వారికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం కోటంరెడ్డికి అస‌లు న‌చ్చేది కాదు.

మ‌న‌సులో వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి ర‌గులుతున్న‌ప్ప‌టికీ, నోరు తెరిచి వారిపై బ‌హిరంగంగా అస‌మ్మ‌తి గ‌ళం వినిపించ‌లేదు. మ‌రోవైపు కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిపై మేక‌పాటి కుటుంబం మొద‌టి నుంచి వ్య‌తిరేకంగా వుంది. 2014లో ఎన్నిక‌ల అనంత‌రం ఇడుపుల‌పాయ‌లో మొద‌టి వైసీపీ ఎమ్మెల్యేల స‌మావేశంలో మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డిపై జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే కోటంరెడ్డి దూష‌ణ‌కు దిగారు. అత్యంత ఆప్తుడైన గౌత‌మ్‌ను తిట్టిన కోటంరెడ్డిపై అప్ప‌ట్లో జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 2019లో నెల్లూరు రూర‌ల్ నుంచి రెండో ద‌ఫా ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలుపొందారు.

అయితే వ్య‌క్తిగ‌త ప‌ర‌ప‌తి పెంచుకోడానికే కోటంరెడ్డి ఆస‌క్తిక‌న‌బ‌రిచారు. నేను- నా కార్య‌క‌ర్త పేరుతో నెల్లూరు రూర‌ల్‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్లే కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఇందులో ఎక్క‌డా జ‌గ‌న్‌, ప్ర‌భుత్వానికి సంబంధం లేకుండా కోటంరెడ్డి ప‌క్కా ప్రణాళిక వేసుకున్నారు. దీంతో కోటంరెడ్డిపై అనుమానాలు త‌లెత్తాయి. ఈ నేప‌థ్యంలో న్యాయ స్థానం నుంచి దేవ‌స్థానం పేరుతో తిరుప‌తికి అమ‌రావ‌తి ఆందోళ‌న‌కారులు చేప‌ట్టిన పాద‌యాత్ర నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చేరిన స‌మ‌యంలో కోటంరెడ్డి మ‌ద్ద‌తు ప‌లికి… ఆయ‌న‌పై అనుమానాల‌కు బ‌లం క‌లిగించేలా వ్య‌వహ‌రించారు.

ఇలా ఒక్కొక్క‌టిగా చంద్ర‌బాబు అభిమానాన్ని చూర‌గొనేందుకు కోటంరెడ్డి న‌డ‌క సాగుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌నులు కావ‌డం లేద‌ని, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని అధికారుల‌పై ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఇరకాటంలోకి నెడుతూ వ‌చ్చారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం కోటంరెడ్డి త‌మ‌ను విడిచి వెళ్తార‌ని న‌మ్మ‌లేక‌పోయింది. ఆ న‌మ్మ‌క‌మే ఇవాళ ఈ ప‌రిస్థితికి తీసుకొచ్చింది. 

మొత్తానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ పెద్ద‌ల‌కు కోటంరెడ్డి షాక్ ఇచ్చారు. కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  ప్రశ్నించారంటే, వైసీపీ నిస్స‌హాయ స్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.