కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలిగిన రోజులలో వైఎస్సార్ సీఎం గా ఉన్న కాలంలో ఆయన నీడగా కేవీపీ రామచంద్రరావు హవా ఒక స్థాయిలో ఉండేది. ఆయన నాడు చక్రం తిప్పేవారు అని చెబుతారు వైఎస్సార్ గతించాక కేవీపీ రాజకీయాల్లో మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను పొందలేకపొయారు అని అంటూంటారు.
దానికి ఉమ్మడి ఏపీ రెండుగా విభజించబడడం ఒక కారణం అయితే ఏపీకి చెందిన కేవీపీకి ఏపీలో కాంగ్రెస్ బలంగా లేకపోవడం మరో కారణంగా అంటారు. కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీకి పూర్తిగా మళ్ళిపోయి కాంగ్రెస్ వట్టిపోయింది.
ఇపుడు చూస్తే తెలంగాణా కాంగ్రెస్ గాలి వీస్తోంది అని అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అక్కడ గెలిస్తే ఏపీలో కూడా ఆ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేవీపీ ఏపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
తరచుగా కేవీపీ విశాఖ వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన రెండు సార్లు విశాఖ వచ్చారు. కాంగ్రెస్ కి ఏమైనా శక్తి చేకూరితే ఆ పార్టీ ప్రభావం చూపే సీట్లలో విశాఖ ఒకటిగా ఉంటుందని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఒకపుడు కాంగ్రెస్ కి బలం ఉంది. అందులో విశాఖలోనే ఎక్కువ ఉంది.
ఈ కారణం చేతనే కేవీపీ విశాఖలో పర్యటనలు చేస్తున్నారు అని అంతా అంటున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేవీపీ స్థానిక కాంగ్రెస్ నాయకులతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేయాలని కూడా సూచించారు. తెలంగాణ ఎన్నికలు ముగిసాక ఈ నెలాఖరులోనైనా లేక కొత్త ఏడాది మొదట్లో అయినా రాహుల్ గాంధీ విశాఖ వస్తారని అంటున్నారు.
విశాఖ ఉక్కు కార్మికులకు సంఘీభావంగా మోడీ ప్రభుత్వం మీద పోరాడేందుకు కాంగ్రెస్ ని సం సిద్ధం చేసేందుకు రాహుల్ వస్తున్నారు అని అంటున్నారు. దానికి పూర్వ రంగంగా కేవీపీ విశాఖలో వరస పర్యటనలు ఏమైనా చేస్తున్నారా అని ఇతర రాజకీయ పార్టీలలో కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది.