దివంగత ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణేన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆయన భార్య నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో తనను పిలవకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆమె లేఖ రాశారు. అలాగే ఆమె మీడియాతో మాట్లాడుతూ పురందేశ్వరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎన్టీఆర్ స్మారక నాణేన్ని ప్రభుత్వమే నిర్వహించి వుంటే తనను ఆహ్వానించకపోవడం తప్పని లక్ష్మీపార్వతి అన్నారు. కానీ ప్రైవేట్ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వెళ్లినట్టుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రాణం తీసినవాళ్లే వారసులుగా చెలామణి అవుతున్నారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ స్మారక నాణేన్ని భార్యగా అందుకోడానికి తనకు మాత్రమే అర్హత వుందని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రాణాల్ని తీసిన వాళ్లు నాణేన్ని ఆందుకోడానికి వెళ్లారా? అని ఆమె నిలదీశారు.
ఇకపై తన పోరాటం పురందేశ్వరిపై అని ఆమె ప్రకటించారు. పురందేశ్వరి దుర్మార్గురాలని ఆమె మండిపడ్డారు. తన వల్ల మీకు జరిగిన నష్టం ఏంటని ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులని ఆమె వెనకేసుకు రావడం విశేషం. కానీ ఎన్టీఆర్ కుమార్తెలు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులని ఫైర్ అయ్యారు. పురందేశ్వరి తిరిగే ప్రతి నియోజకవర్గంలో తాను వ్యతిరేకంగా తిరుగుతానని ఆమె ప్రకటించారు.
వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తానని ఆమె హెచ్చరించారు. పురందేశ్వరి తిరిగే చోట ఒక్క సీటు కూడా రాకుండా చేస్తానని ఆమె ప్రతిజ్ఞ చేశారు. వీళ్ల నుంచి ఇంకెన్నాళ్లు అవమానాలు భరించాలని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు. ఎన్టీఆర్ కష్టాల్లో వుంటే పురందేశ్వరి ఏనాడైనా వచ్చిందా? అని నిలదీశారు.
తనను ఎందుకు చులకన చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనను చులకన చేయడం అంటే ఎన్టీఆర్‌ను అవమానించినట్టే అని ఆమె స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడవడానికి పురందేశ్వరే ప్రధాన కారకురాలని ఆమె ఆరోపించారు.