Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎక్సైజ్‌శాఖ‌లో బ‌దిలీల‌లు!

ఎక్సైజ్‌శాఖ‌లో బ‌దిలీల‌లు!

ఏపీ ఎక్సైజ్‌శాఖ‌లో బ‌దిలీలల గురించి అందులో ప‌ని చేసే సిబ్బంది క‌థ‌లుక‌థలుగా చెబుతున్నారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల బ‌దిలీలు వేస‌వి సెల‌వుల్లో మే, జూన్ నెల‌ల్లో జ‌రుగుతుంటాయి. ఎందుకంటే అప్పుడైతే పిల్ల‌ల చ‌దువుకు ఇబ్బంది లేకుండా కుటుంబాల‌ను మార్చుకోడానికి అనువుగా వుంటుంది. కానీ అన్ని శాఖ‌ల‌ది ఒక దారైతే, ఎక్సైజ్‌శాఖ మాత్రం త‌న బ‌దిలీల రూటే స‌ప‌"రేటు" అని చెబుతోంది.

బ‌దిలీల వ్య‌వ‌హారంలో భారీ మొత్తంలో డ‌బ్బులు చేతులు మారిన‌ట్టు విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. ఇందుకు ఎక్సైజ్‌శాఖ అసోసియేష‌న్ నాయ‌కుడు రింగ్ మాస్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సిబ్బంది ఆరోపిస్తుండడం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోయి నాలుగేళ్ల‌కు పైగా అవుతున్నా, ఆయ‌న సామాజిక వ‌ర్గానికి చెందిన ఉద్యోగ సంఘ నాయ‌కుడు మాత్రం అక్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని సిబ్బంది గ‌గ్గోలు పెడుతున్నారు. పైగా స‌ద‌రు అసోసియేష‌న్ ప‌ద‌వీ కాల ప‌రిమితి మూడేళ్లు దాటినా, ఇంకా కొన‌సాగుతూ బ‌దిలీల‌ను అడ్డుపెట్టుకుని పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్న‌ట్టు విమ‌ర్శ‌లున్నాయి. ఈ శాఖ ఉన్న‌తాధికారిని అడ్డు పెట్టుకుని నిబంధ‌న‌లు, సీనియారిటీని ప‌క్క‌న పెట్టి మ‌రీ బ‌దిలీల‌ను వేలం వేస్తున్నార‌ని ఉద్యోగులు ల‌బోదిబోమంటున్నారు. అసోసియేష‌న్‌లో ఉన్న వారిని బ‌దిలీల్లో మిన‌హాయించ‌డం విశేషం.

బ‌దిలీల‌పై భారీగా విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు ఉద్యోగుల నుంచి రావ‌డంతో ముగ్గురు సీనియ‌ర్ అధికారుల‌తో కూడిన క‌మిటీని ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీకి 1100 విన‌తిప‌త్రాలు వెళ్లిన‌ట్టు తెలిసింది. క‌నీసం వాటిలో ఏముందో తెలుసుకునే తీరిక‌, శ్ర‌ద్ధ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. విన‌తిప‌త్రాల‌ను బుట్ట‌దాఖ‌లు చేసి బ‌దిలీల ప్ర‌క్రియ‌ను య‌థేచ్ఛ‌గా చేప‌ట్టారు.

ఎక్సైజ్ విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్ నుంచి పైస్థాయి అధికారుల వరకు సుమారు 850 మంది కోర్టుకు వెళ్లి బదిలీలపై స్టేటస్ కో తెచ్చుకున్నారు. ఈ స్థాయిలో ఏ శాఖ‌లోనూ బ‌దిలీల‌పై కోర్టును ఆశ్ర‌యించిన దాఖ‌లాలు ఇంత వ‌ర‌కూ లేవ‌ని అంటున్నారు. సాధారణ బదిలీలు అయిన త‌ర్వాత కూడా ప్రత్యేక అనుమతులు తెచ్చుకొని వారికి ఇష్టం వచ్చిన వారిని బదిలీల్లో మినహాయించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మూడేళ్ల కాల ప‌రిమితి పూర్తికాకుండానే బ‌ల‌వంతంగా బ‌దిలీ చేశారు. ఈ అక్ర‌మాల వెనుక భారీగా చేతుల మార‌డ‌మే కార‌ణ‌మ‌ని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.  

కోర్టును ఆశ్ర‌యించినా ఉన్న‌తాధికారి వైఖ‌రిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అర్ధాంతరంగా బ‌దిలీ చేస్తే పిల్ల‌ల చ‌దువులు, వారికి చెల్లించిన ఫీజులు ఏం కావాల‌నే ప్రశ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఉద్యోగి ఒక చోట‌, మిగిలిన కుటుంబ స‌భ్యులు మ‌రో చోట ఉండాల్సిన ద‌య‌నీయ స్థితి... ఉన్న‌తాధికారుల అసంబ‌ద్ధ నిర్ణ‌యాల వ‌ల్ల ఏర్ప‌డుతోంద‌నే ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  

సెబ్‌ నుంచి ఎక్సైజ్‌కు మార్చేటప్పుడు ఒక రకమైన సీనియారిటీని పాటించారు. ఎక్సైజ్ నుంచి సెబ్‌కు మార్చేటప్పుడు మరో రకమైన సీనియార్టీని పాటించారు. సీనియారిటీ లిస్టులో ఒక ప‌ద్ధ‌తి లేకుండా సీనియర్లను అలాగే ఉంచి జూనియర్లని సెబ్‌కు కేటాయించారు. సెబ్ నుంచి ఎక్సైజ్‌కు కేటాయించిన వాళ్లు భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్లు ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే ఎక్సైజ్ నుంచి సెబ్‌కు కేటాయించ‌కుండా అక్క‌డే కొనసాగడానికి కూడా కొందరు భారీగా ముడుపులు ముట్ట‌చెప్పిన‌ట్టు వార్త‌లొస్తు న్నాయి. జూనియర్లను సెబ్‌కు కేటాయించడంతో ఈ విమ‌ర్శ నిజ‌మ‌ని న‌మ్మాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

బ‌దిలీల ప్ర‌క్రియ ప్ర‌స్తుతం కోర్టులో ఉంద‌ని, ఇవాళో రేపో తీర్పు వ‌చ్చిన త‌ర్వాత సీనియారిటీ లిస్ట్‌ను రివైజ్ చేసి త‌మ‌కు న్యాయం చేయాల్సిందిగా బాధిత ఉద్యోగులు వేడుకుంటున్నారు. ప్ర‌స్తుతం  సెబ్, ఎక్సైజ్ కేటాయింపులు వివాదాస్పదంగా మారాయి. సెబ్‌ లో పనిచేస్తున్న కొంతమంది అర్హతలు లేకపోయినా డబ్బు ఖర్చు పెట్టి ఎక్సైజ్ శాఖకు మార్పించుకున్నారు. అదే విధంగా ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న కొంతమంది ఎన్నో ఏళ్లుగా ఎక్సైజ్ లో పనిచేస్తున్నా డబ్బు ఖర్చు పెట్టి అక్కడే పాతుకుపోయారు. మరి కొంతమందిని మూడేళ్ల స‌ర్వీస్ సర్వీసు పూర్తి కాకపోయినా బలవంతంగా సెబ్‌కు కేటాయించడంతో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ మొత్తం అవినీతి మ‌త్తుకు ఎక్సైజ్‌శాఖ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సూత్ర‌ధారి అనే విమ‌ర్శ వుంది. అంద‌రి ద‌గ్గ‌ర డ‌బ్బు వ‌సూలు చేసి, ఉన్న‌తాధికారికి ముట్ట‌చెప్పి, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా  వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. దీనికి ప్ర‌భుత్వం ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?