ఏపీలో వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగింపు వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఇప్పట్లో చల్లారేలా కూడా కనబడటంలేదు. కొందరు జగన్ ను సమర్ధిస్తూ, కొందరు ఘాటుగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. నందమూరి బాలయ్య కూడా పరుష పదజాలంతో విమర్శించాడు. చాలా పెద్ద పెద్ద మాటలు ఉపయోగించాడు. జగన్ ను ప్రశంసిస్తూ, చంద్రబాబును చీల్చి చెండాడే కొందరు వైసీపీ నేతలు కూడా జగన్ పై సున్నితంగానే విమర్శలు చేశారు. మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ వైసీపీలో పెద్దాయన వీరాభిమానులు జగన్ కు విజ్ఞప్తులు చేశారు.
కానీ వైసీపీలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదు. అనేకమంది నాయకుల్లో ఆమె ఒకరైతే ఎవరూ అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆమె మామూలు వ్యక్తి కాదు. ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి. ఆమెను ఎన్టీఆర్ భార్యగా నందమూరి, నారా కుటుంబాలు ఒప్పుకోవనుకోండి. అది వేరే విషయం. జగన్ తీసుకున్న చర్యపై ఆమె ఇప్పటివరకు తన అభిప్రాయం పాజిటివ్ గానో, నెగెటివ్ గానో చెప్పలేదు. అలా మౌనంగా ఉండిపోయారంతే. దీంతో ఆమెను ఎలా అర్ధం చేసుకోవాలో జనాలకు, నాయకులకు అర్ధం కావడంలేదు. ఆమె ఎప్పటికైనా తన అభిప్రాయం చెబుతుందో లేదో తెలియదు.
ఎన్టీఆర్ తో రాజకీయపరమైన సంబంధం ఉన్నవారే తమ అభిప్రాయాలు చెబుతున్నప్పుడు లక్ష్మి పార్వతి ఆయన భార్య అయివుండి ఏమీ మాట్లాడకపోవడం విచిత్రంగా ఉంది. అవుననో, కాదనో, వాళ్లిష్టమనో అనాలి. కానీ మాటే రాని మౌనాన్ని ఆశ్రయించడం ఏ రకంగా చూసినా సబబు కాదు. ఎన్టీఆర్ హెల్త్ వర్సి టీ పేరు జగన్ సర్కార్ మార్చేసింది. దీన్ని గురించిన వివరణా అసంబద్ధంగానూ ఉంది. రాష్ట్ర ప్రజ లే గాక, యావత్ తెలుగు ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయాన్ని విమర్శించారు. ఎన్టీఆర్ అభిమానులు.. అన్ని రంగాలవారూ తీవ్రంగా స్పందించారు.
కానీ ఎన్టీఆర్ ధర్మపత్ని లక్ష్మీపార్వతి మాత్రం మౌనం వహించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తక్షణమే స్పందించాల్సిన లక్ష్మీ పార్వతి పెదవి విప్పడం లేదు. ఆమె స్పందన తెలుసుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పలు మార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. తెలుగు భాష అనగానే మొదటగా అందరికీ స్ఫురించే పేరు ఎన్టీఆర్… అంటూ చాలాకాలం క్రితమే భారీ ఉపన్యాసాలు దంచారు లక్ష్మీపార్వతి. ఆయన్ను మించిన నటుడు, రాజకీయవేత్త లోకంలో ఎవ రూ లేరని ఆకాశానికి ఎత్తారు. ఎన్టీఆర్ సతీమణిగానే కాక ఆమెకు వీరాభిమానిగా కూడా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు.
కాలక్రమంలో పరిస్థితులు మారి ఆమె ఎన్టీఆర్ కుటుంబానికి దూరమయినప్పటికీ ఎన్టీఆర్ పేరు, చరిత్ర గురించి ఎవరు ప్రస్తావించినా ఆమె పూనకం వచ్చిన వ్యక్తిలా ఊగిపోయేవారు. అసలు టీడీపీ నాశనమయింది చంద్రబాబు వల్లేనని, ఎన్టీఆర్ అమాయకత్వంతో బాబుని చేరదీయడంతో బాబు పార్టీ పరిస్థితి దిగజార్చారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. టీడీపీకి అలా దూరమై జగన్ నెలకొల్పిన వైసీపీకి దగ్గరయ్యారు. ఆయన గౌరవ పదవితో సమాదరించారు. అంతే …వైసీపీని నెత్తిన పెట్టుకుని జగన్ ను ఆకాశానికి ఎత్తారు. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఎన్నడూ ఆమె ఎవరినీ పల్లెత్తు మాట వ్యతి రేకంగా అననీయలేదు.
ఎక్కడ, ఎవరి మాట విన్నా స్పందించి విరుచుకుపడేవారు. అలాంటిది తాజాగా పెను వివాదానికి కారణమైన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ విషయంలో మాత్రం ఆమె మౌనాన్ని ఆశ్రయించారు. వైసీపీ నీడలో ఉన్నందువల్ల ఈ వ్యవహారంపై కామెంట్ చేస్తే పార్టీలో తన పదవికి (రాష్ట్ర తెలుగు -సంస్కృత అకాడమీ చైర్ పర్సన్) ముప్పు వస్తుందని జంకతున్నారా? లేదా జగన్ తీసుకున్నది సరైన నిర్ణయమేనని గౌరవంతో ఊరుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.