ఈ దేశంలోని అరవై శాతం పైగా ప్రజలను బిక్షగాళ్ళుగా మార్చిన ఘనత నరేంద్ర మోడీదట. ఈ మాటను ఎర్రన్నలు అంటున్నారు. ఇప్పటిదాకా మోడీ మీద ఏ రకమైన విమర్శలు వచ్చినా దీని ముందు దిగదుడుపే అని చెప్పాలి. దేశంలో 143 కోట్ల మంది ప్రజానీకం ఉంటే అందులో నుంచి అరవై శాతం ప్రజలను బిక్షగాళ్ళుగా చేయడం అంటే ఆలోచిస్తే ఎంత పెద్ద విమర్శగా దీన్ని చూడాలని అంటున్నారు.
మోడీ తొమ్మిదేళ్ళ పాలన వల్ల ఇలా జరిగింది అని కామ్రేడ్స్ అంటున్నారు. దేశంలో నిరుద్యోగాన్ని పెంచి యువతను నిర్వీర్యం చేశారు అని ఏఐటీయూసీ జాతీయ నేత అమృత్ జిత్ కౌర్ ఘాటైన విమర్శలే చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరసబెట్టి ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వం దేశంలో ఆస్తులను లేకుండా చేస్తోందని ఆమె ఆగ్రహించారు.
కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టరం ఏ రకమైన ఆర్థిక నీతి అని ఆమె నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణతో పాటు దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటూ సీపీఐ ఆద్వర్యంలో బస్సు యాత్రను ఆమె విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిందని విమర్శించారు.
దేశంలో నిరుద్యోగం అంతకంతకు పెరిగిపోతోందని, కొత్త పరిశ్రమలు ఎటూ స్థాపించడంలేదని, ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయడమేంటి అని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఏపీ అంతా తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ అంటున్నారు.