వైసీపీలో ముందస్తు సందడి …విపక్షాలు షాక్ తినేలా !

ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ విపక్షాలు ఎప్పటికపుడు కలవరిస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా ముందస్తు విజయోత్సవాలను వైసీపీ జరుపుకుంటోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఇవాళో రేపో తమదే అధికారం అని వైసీపీ ఎన్నికై అధికారం…

ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ విపక్షాలు ఎప్పటికపుడు కలవరిస్తూ ఉంటాయి. దానికి భిన్నంగా ముందస్తు విజయోత్సవాలను వైసీపీ జరుపుకుంటోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఇవాళో రేపో తమదే అధికారం అని వైసీపీ ఎన్నికై అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి విపక్షాలు కొన్ని అదే పనిగా ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి.

అక్షరాలా నాలుగున్నర సంవత్సరాలు గడించింది కానీ ముందస్తు ఊసే లేదు. దాంతో ఇపుడు కాస్తా వాస్తవంలోకి వచ్చిన విపక్షాలు ఆరు నెలలు ఆగండి అని షెడ్యూల్ ని గుర్తు చేసుకుని మరీ మాట్లాడుతున్నాయి. అంటే 2024 ఎన్నికలకే విపక్షం మానసికంగా సిద్ధమైనట్లుగా భావించాలి.

ఇపుడు చూస్తే జాతీయ మీడియా ప్రతీ నాలుగు నెలలకు ఒక సర్వేను వదులుతోంది. ఆ సర్వేలో వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. ఇప్పటికిపుడు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీదే ఘన విజయం అంటూ సర్వేలు వెలువడుతున్నాయి. గడచిన సర్వేకూ తాజా సర్వేకూ మధ్య ఓటింగ్ శాతం వైసీపీది పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు.

దీంతో మరో ఎనిమిది నెలలలో ఎన్నికలు అంటే విజయం ఖాయమని వైసీపీ శ్రీణులలో నమ్మకం ఏర్పడిపోతోంది. విపక్షాల తీరు చూస్తే వైసీపీ పధకాలను మేము కూడా ఇస్తామని చెబుతున్నారు. జగన్ దిగిపోతే పధకాలు ఆగవంటూ మాట్లాడుతున్నారు. దీనిని బట్టి సంక్షేమ పధకాలు  ఎంత స్ట్రాంగ్ అన్నది విపక్షానికి అర్ధం అయింది. ఈలోగా పుణ్య కాలం పూర్తిగా గడచిపోతోంది.

వరసబెట్టి వస్తున్న సర్వేలు అన్నీ వైసీపీ ఘన విజయం ఖాయమని చెబుతూండడంతో విశాఖ జిల్లా వైసీపీ ఆద్వర్యంలో ముందస్తు విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ వైసీపీ శ్రేణులు సందడి చేశాయి. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించాయి. వైసీపీ విశాఖ జిల్లా ప్రెసిడెట్ కోలా గురువులు, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మరోసారి చరిత్ర తిరగరాసే విజయాన్ని వైసీపీ దక్కించుకోబోతోందని అంటున్నారు. ముందస్తు విజయోత్స సంబరాలను జరుపుకునే ధీమా వైసీపీకి మాత్రమే ఉందని ఆ పార్టీ నాయకులు  అంటున్నారు.