తనపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు విసిరితే… జనసేనాని పవన్‌కల్యాణ్ ట్విటర్ వేదికపైకి వచ్చారు. తన గోడు ఏదో చెప్పుకున్నారు. కనీసం శ్వాస అయినా తీసుకోనివ్వరా అని ఆయన ప్రశ్నించారు. ఏం ఆ మాత్రం కూడా ఆయనకు స్వేచ్ఛ లేదా? అబ్బే… పవన్‌ను నిద్రపోనివ్వమనే రీతిలో వైసీపీ నేతలు వెంటనే కౌంటర్లు మొదలు పెట్టారు.
పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచార రథంపై పేర్ని నాని ఓ రేంజ్‌లో పంచ్‌లు కురిపించారు. వారాహి వాహనానికి ఆలీవ్ గ్రీన్ రంగు వేయడంపై నాని మండిపడ్డారు. పసుపు రంగు వేసుకోవాలని హితవు పలికారు. ఇదేమయ్యా అంటే… మోటార్ వెహికల్ చట్ట ప్రకారం ఆలివ్ గ్రీన్ కలర్ వేయకూడదని తనకు తెలిసిందేదో ఆయన చెప్పుకొచ్చారు.
నాని పేరు ప్రస్తావించకుండా పవన్ సమాధానం ఇచ్చారు. కనీసం ఆలివ్ గ్రీన్ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ దాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు. తన ప్రచార రథంపై వివాదం సృష్టిస్తున్నారని, కనీసం శ్వాస అయినా తీసుకోనివ్వరా అంటూ ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో పవన్‌కు అంబర్ కౌంటర్ వేశారు. “శ్వాస తీసుకో… ప్యాకేజీ వద్దు” అంటూ పవన్‌పై సెటైర్ విసిరారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ్తానని ఆ మధ్య పవన్‌కల్యాణ్ పాదరక్ష చేతికి తీసుకుని చూపించిన సంగతి తెలిసిందే. పవన్ హెచ్చరికలను వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పవన్‌ను ప్యాకేజీ నాయకుడి మరోసారి ప్రజల ముందు నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా వుండగా అంబటి ట్వీట్‌పై జనసేన తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తోంది. శ్వాస తీసుకో… అవినీతి వద్దు అంటూ అంబటికి ఆయన మాటల్లోనే సమాధానం ఇవ్వడం గమనార్హం.