లోన్ యాప్ : పోయిన ప్రాణాలు పోలీసుల ఖాతానే!

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మొబైల్ ఫోను ద్వారా లోను యాప్ వారు.. ఇలా అడిగిన వెంటనే చిన్న మొత్తాలు లోన్ గా ఇవ్వడం, ఆ తర్వాత…

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. మొబైల్ ఫోను ద్వారా లోను యాప్ వారు.. ఇలా అడిగిన వెంటనే చిన్న మొత్తాలు లోన్ గా ఇవ్వడం, ఆ తర్వాత చెల్లింపు కోసం దారుణంగా వేధించడం.

అయిదువేల రూపాయలు లోన్ ఇచ్చినా సరే.. తిరిగి చెల్లింపుల కింద లక్షల్లో కట్టించుకోవడం.. చెల్లించని వారిని దారుణమైన మాటలతో వేధించడం.. వారి ఫోను కాంటాక్ట్స్ అందరికీ ఫోన్లు చేసి వారి గురించి అసభ్యంగా మాట్లాడుతూ పరువు తీయడం వంటి సంఘటనలు దాదాపు ప్రతిరోజూ కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.

నిజానికి వెలుగులోకి వస్తున్న ఉదంతాలు.. అలాంటి మోసాల్లో పది శాతం కూడా లేవంటే అతిశయోక్తి కాదు. పోలీసుల వరకు చాలా కేసులు వెళ్లడం లేదు. వెళ్లినా పోలీసులు కేసులు రిజిస్టరు చేయడం లేదు. ఉచిత సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. 

అయితే తాజాగా నెల్లూరు పోలీసులు ఓ ఘనత సాధించారు. చెన్నై దాకా వెళ్లి లోన్ యాప్ ల తరఫున ఫోన్లు చేసి కస్టమర్లను బెదిరిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. నిజంగా ఇందుకు పోలీసులను అభినందించాలి.

ఈ సందర్భంగా నెల్లూరు ఎస్పీ విజయరావు మాట్లాడుతూ.. లోను తీసుకున్న వారికి కాకుండా.. ఇతర నెంబర్లకు ఫోను చేయడం చట్టరీత్యా నేరం అని కూడా చెప్పారు. ఆన్ లైన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవద్దని ఎస్పీ ప్రజలకు హితవు చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ.. ప్రజల్లో ఎవరికైనా ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పడం మాత్రం కామెడీగా ఉంది. 

ఇప్పటికి ఇలాంటివి కొన్ని వేల ఫిర్యాదులు, వేల వేధింపులు పోలీసులు రికార్డుల్లోకి వెళ్లకుండానే మరుగున పడిపోతున్నాయి. లోన్ యాప్ వేధింపులు చేస్తున్న వారిని అరెస్టు చేయడం ద్వారా.. నెల్లూరు పోలీసులు సాధించిన ఘనత చిన్నదేం కాదు.. కానీ.. వారి వేధింపుల ఫోన్లు సాక్షాత్తూ మాజీ మంత్రి అనిల్ కుమార్ కు వచ్చిన నేపథ్యంలో మాత్రమే వారు స్పందించారు.

అనిల్ కు వేధింపులు రావడంతో తక్షణం స్పందించి.. చెన్నైలో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇన్నాళ్లూ ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారు. దీని అర్థం ఏంటంటే.. మన పోలీసులకు లోన్ యాప్ వేధింపులకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయగల సత్తా ఉంది.. సామర్థ్యం ఉంది.. కానీ.. ఆ వేధింపులు ఎదుర్కొటున్నది సామాన్య ప్రజలు అయిన సందర్భాల్లో వారు పట్టించుకోవడం లేదు. 

లోన్ యాప్ ల వారు.. కేవలం వేధింపులు మాత్రమే కాకుండా.. 5వేల లోన్ కు లక్షలరూపాయలు చెల్లించిన తర్వాత కూడా ఇంకా కట్టాల్సిందే అని వేధించడం చాలా రివాజుగా మారింది. లోన్ తీసుకున్న వారు ఆడవాళ్లయితే వాళ్ల ఫోటోలను మార్ఫింగా చేసి నగ్నంగా తయారుచేసి.. వారి ఫోను కాంటాక్ట్స్ లో ఉన్న అందరికీ పంపడం.. వారి పరువు పోయేలా చేయడం ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. కేవలం అయిదువేల రుణం తీసుకున్న పాపానికి వేలకు వేలు చెల్లించిన తర్వాత కూడా వేధింపులు ఆగక.. సామాన్యులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు మన తెలుగురాష్ట్రాల్లో కొన్ని వందలు ఉన్నాయి. 

కేవలం మంత్రికి వేధింపులు వచ్చినప్పుడు మాత్రం స్పందించి అరెస్టు చేసిన పోలీసులు.. ఇదే కష్టం సామాన్యుడికి వచ్చినప్పుడు కూడా స్పందించి ఉంటే.. ప్రజల ప్రాణాలు కాపాడి ఉండేవారు కదా..! ఎన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా.. రాని చలనం.. మంత్రికి కాకపుట్టేసరికి పోలీసులకు వచ్చింది. ఇలాంటి అరెస్టులు ఇంకా చాలా పెద్ద సంఖ్యలో జరిగితే గనుక.. లోన్ యాప్ నిర్వాహకులే భయపడే పరిస్థితి.. చైనా నుంచి ఆపరేట్ చేసే సంస్థలకు స్థానికంగా ఉద్యోగులు దొరకని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది.

పోలీసులు, తాము కేవలం పెద్దల కోసం మాత్రమే కాకుండా, సామాన్యుల కోసం పనిచేయాలని అనుకుంటే.. ఇలాంటి చావులన్నీ కూడా కట్టడి అవుతాయి.