అమ్మో అమ్మో…యాంగ్రీ లోకేశ్‌!

నారా లోకేశ్ అంటే సోష‌ల్ మీడియా కింగ్ అని పేరు. ప్ర‌జాక్షేత్రంలో ఆయ‌న క‌నిపించేది చాలా త‌క్కువ‌. ట్వీట్లు, పోస్టులు అంటూ త‌నదైన లోకంలో లోకేశ్ ఉంటారు. లోకేశ్‌ను లీడ‌ర్ చేయాల‌ని తండ్రి చంద్ర‌బాబు…

నారా లోకేశ్ అంటే సోష‌ల్ మీడియా కింగ్ అని పేరు. ప్ర‌జాక్షేత్రంలో ఆయ‌న క‌నిపించేది చాలా త‌క్కువ‌. ట్వీట్లు, పోస్టులు అంటూ త‌నదైన లోకంలో లోకేశ్ ఉంటారు. లోకేశ్‌ను లీడ‌ర్ చేయాల‌ని తండ్రి చంద్ర‌బాబు ఆరాట‌మే త‌ప్ప‌, నిజంగా ఉండాల్సిన వ్య‌క్తిలో ఆ “వాడి” ఉండ‌డం లేదు. తాజాగా లోకేశ్‌లో కోపం త‌న్నుకొచ్చింది. యాంగ్రీ లోకేశ్‌గా టీడీపీ శ్రేణులు స‌రికొత్త నాయ‌కుడిని చూశాయి.

శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాస ప‌ర్య‌ట‌న నిమిత్తం లోకేశ్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగి గ‌మ్య‌స్థానానికి బ‌య‌ల్దేరారు. మూడు రోజుల క్రితం ప‌లాస మున్సిప‌ల్ 27వ వార్డు కౌన్సిల‌ర్ , టీడీపీ నాయ‌కుడు సూర్య‌నారాయ‌ణ ఇళ్ల‌ను ప‌డ‌గొట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నించారు. టీడీపీ నాయ‌కులు ప్ర‌తిఘ‌టించ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంది.

సూర్య‌నారాయ‌ణ‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్ప‌డానికి లోకేశ్ ప‌లాస బ‌య‌ల్దేరారు. శ్రీ‌కాకుళం న‌గ‌ర స‌మీపంలోని హైవేపై ఆయ‌న్ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ అడ్డ‌గింత‌ను నిర‌సిస్తూ కొత్త‌రోడ్డు కూడ‌లి వ‌ద్ద లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, చిన‌రాజ‌ప్ప త‌దిత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాకు దిగారు. కొంద‌రు కార్య‌క‌ర్త‌ల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సంద‌ర్భంలో లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీస్ అధికారులు ప్ర‌య‌త్నించారు.

దీన్ని తీవ్ర‌స్థాయిలో లోకేశ్ ప్ర‌తిఘ‌టించారు. త‌న‌ను తాకొద్దంటూ తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో పోలీస్ అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. మ‌ర్యాద వుండ‌ద‌ని హెచ్చ‌రించారు. లోకేశ్‌ను ముట్టుకోవ‌ద్ద‌ని కార్య‌క‌ర్త‌లు గ‌ట్టిగా నిన‌దించారు. అయిన‌ప్ప‌టికీ పోలీస్ అధికారులు లెక్క చేయ‌లేదు. లోకేశ్‌తో పాటు చిన‌రాజ‌ప్ప‌, క‌ళా వెంక‌ట్రావు త‌దిత‌రుల‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి ఎచ్చెర్ల స‌మీపంలోని జేఆర్ పురం పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.