ఏపీలోనే కాదు, దేశమంతా మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. మహిళను భోగ వస్తువుగా సమాజం చూసే దృష్టే …అఘాయిత్యాలకు కారణమవుతోంది. పాలకులు ఎవరున్నా, ఇందులో పెద్దగా మార్పు రావడం లేదు. మహిళలపై లైంగిక దాడులే కాదు, మానసిక హింస చాలా తీవ్రంగా వుంటోంది. వరకట్న వేధింపులు, పిల్లలు పుట్టకపోవడానికి మహిళే కారణమని అత్తింటి వాళ్ల సాధింపు… ఇలా అనేక కారణాలతో ఆడవాళ్లను హింసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో మహిళలపై లైంగిక దాడులు రాజకీయ రంగు పులుముకున్నాయి. లైంగిక దాడులపై ఓట్లు ఎలా ఏరుకోవాలనే నీచ అన్వేషణే తప్ప, మహిళలపై అఘాయిత్యాలను ఆపే చర్యలు చేపట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఏపీలో లైంగికదాడులపై రాజకీయ పార్టీల వీధి కొట్లాటలు చూస్తుంటే జుగుప్స కలగకుండా ఉండదు.
లైంగిక దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శలు ఆయనలో గూడు కట్టుకున్న శాడిజాన్ని ప్రతిబింబిస్తోంది. లైంగిక దాడుల నివారణకు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడం మాని, కేవలం ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికే పరిమితం కావడాన్ని చూడొచ్చు. దీంతో ప్రధాన ప్రతిపక్షం రాజకీయ ఎజెండా ఏంటో చెప్పకనే చెబుతోంది.
‘మీలో చలనం రావాలంటే ఇంకెంత మంది ఆడబిడ్డలు బలవ్వాలి జగన్ రెడ్డి గారు?. విజయనగరం జిల్లాలో అర్థరాత్రి ఘోరం జరిగినా మీ మనస్సు కరగదా?. పైగా మహిళా హోంమంత్రి వనిత అత్యాచారాలు కొన్ని అలా జరుగుతూ ఉంటాయ్ అని మాట్లాడటం అన్యాయం. విజయనగరంలో హెడ్ కానిస్టేబుల్ కొడుకు చెర్రీ స్నేహితులతో కలిసి వివాహితపై అమానవీయంగా దాడి చేసి పిల్లల ఎదుటే అత్యాచారానికి పాల్పడ్డటం దారుణం. ప్రతి రోజు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనలతో అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. దిశ చట్టం పేరుతో చేసిన మోసం చాలు ’ అని లోకేశ్ విరుచుకుపడ్డారు.
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఆవేదన కేవలం నటన మాత్రమే అని వైసీపీ విమర్శిస్తోంది. లోకేశ్ మొదలు పెట్టడమే జగన్‌పై నేరుగా విమర్శలతోనే అని అధికార పార్టీ గుర్తు చేస్తోంది. నిజంగా లోకేశ్‌కు చిత్తశుద్ధి వుంటే …లైంగిక దాడులను అరికట్టేందుకు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా సరైన సూచనలు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు కోరుతున్నారు.
లైంగిక దాడులను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి వాడుకోవడం చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలకే చెల్లిందని విమర్శిస్తున్నారు. గోతి దగ్గర గుంటనక్కల్లా… లైంగిక దాడుల కోసం ప్రధాన ప్రతిపక్షం ఎదురు చూస్తున్నట్టుగా వారి స్పందనే తెలియజేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.