లోకేశా మీ ఊరు ఏదీ? పోటీ చేస్తున్న‌దెక్క‌డ‌?

ఎదుటి వాళ్లను విమ‌ర్శించ‌డంలో చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేశ్ ముందు వ‌రుస‌లో వుంటారు. అయితే త‌మ చ‌రిత్ర ఏంటో ఎవ‌రికీ తెలియ‌ద‌ని తండ్రీత‌న‌యుడు భ్ర‌మ‌ల్లో బ‌తుకుతుంటార‌నే విమర్శ వుంది. పాద‌యాత్ర‌లో భాగంగా తిరుప‌తిలో భ‌వ‌న…

ఎదుటి వాళ్లను విమ‌ర్శించ‌డంలో చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేశ్ ముందు వ‌రుస‌లో వుంటారు. అయితే త‌మ చ‌రిత్ర ఏంటో ఎవ‌రికీ తెలియ‌ద‌ని తండ్రీత‌న‌యుడు భ్ర‌మ‌ల్లో బ‌తుకుతుంటార‌నే విమర్శ వుంది. పాద‌యాత్ర‌లో భాగంగా తిరుప‌తిలో భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌తో లోకేశ్ ముఖాముఖి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స్థానిక‌త‌పై ఆయ‌న విమ‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది.

తిరుప‌తి ఎమ్మెల్యే కరుణాక‌ర‌రెడ్డిది క‌డ‌ప జిల్లా అని, ఇక్క‌డ పెత్త‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. దీంతో చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌, బామ్మ‌ర్ది స్థానిక‌త‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తండ్రిది క‌డ‌ప జిల్లా. వృత్తి రీత్యా ఆయ‌న రైల్వేలో ఉద్యోగి. తిరుప‌తిలో సెటిల్ అయ్యారు. తిరుప‌తిలోనే భూమన క‌రుణాక‌ర‌రెడ్డి జ‌న్మించారు. తిరుప‌తితో ఆయ‌నది పేగు బంధం. ప‌విత్ర ఆధ్యాత్మిక క్షేత్ర‌మైన తిరుప‌తిలో పుట్ట‌డ‌మే అదృష్టంగా ఆయ‌న చెబుతుంటారు. అంతెందుకు, ప్ర‌పంచంలో ఏ న‌గ‌రానికి లేని విధంగా తిరుప‌తికి పుట్టిన రోజు ఉంద‌ని, వ‌రుస‌గా రెండో ఏడాది ఆ వేడుక‌ను ఆయ‌న నిర్వ‌హించారు. అలాంటి వ్య‌క్తిని ప‌ట్టుకుని, స్థానిక‌త విష‌యంలో విమ‌ర్శించ‌డం లోకేశ్‌కే చెల్లింది.

లోకేశ్ కుటుంబం విష‌యానికి వ‌ద్దాం. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన చంద్ర‌గిరిని వ‌దిలి కుప్పానికి వెళ్లారు. మూడు ద‌శాబ్దాల‌కు పైబ‌డి అక్క‌డే రాజ‌కీయాలు చేస్తున్నారు. అలాగే చంద్ర‌బాబు బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌కృష్ణ ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 

ఇక లోకేశ్‌ను తీసుకుంటే… గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నుంచి మొద‌టిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. వీళ్లంతా పుట్టిందెక్క‌డ‌? రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్న‌దెక్క‌డ‌? ఇవేవీ ఎవ‌రికి తెలియ‌ద‌న్న భ్ర‌మ‌లో ప్ర‌త్య‌ర్థుల‌పై నోరు జార‌డం దేనికి నిద‌ర్శ‌నం? అహంకార‌మా? ఎవ‌రూ ప్ర‌శ్నించ‌ర‌నే లెక్క‌లేని త‌ర‌మా? ఏమ‌నుకోవాలి లోకేశ్ వ్య‌వ‌హారాన్ని?

బాబు, బాల‌య్య , లోకేశ్ నివాసం హైద‌రాబాద్‌లో. రాజ‌కీయం మాత్రం ఏపీలో చెట్టుకొక‌రు, పుట్ట‌కొక‌ర‌న్న‌ట్టుగా పోటీ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు …తిరుప‌తిలోనే పుట్టి, పెరిగి, ఆధ్మాత్మిక న‌గ‌ర సంస్కృతి, సంప్ర‌దాయాల‌తో మ‌మేకమై జీవ‌నం సాగిస్తున్న ఎమ్మెల్యేను ప్ర‌శ్నించ‌డం లోకేశ్ అజ్ఞానాన్ని తెలియ‌జేస్తోంది.