పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ దాడులు పురివిప్పాయి. మాచర్లలో పట్టు కోసం టీడీపీ తపిస్తోంది. ఏదో ఒక రకంగా మాచర్ల పట్టణంలో పాగా వేయాలని టీడీపీ గత కొన్ని రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తోంది. మాచర్ల పట్టణం మినహాయించి నియోజక వర్గం వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాచర్ల టౌన్‌లో అడుగు పెట్టడానికి పక్కా ప్రణాళిక రచించింది.
మాచర్లలో ఏ ఏరియాలో పెడితే గొడవలు జరుగుతాయో ముందుగా ఓ అంచనాకు వచ్చింది. ఆ మేరకు మాచర్ల వడ్డెరకాలనీలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారి నుంచి వడ్డెర కాలనీ వైపు టీడీపీ ర్యాలీగా బయల్దేరింది. అప్పుడే గొడవ మొదలైంది.
వడ్డెరకాలనీలోనే టీడీపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే పట్టు పట్టడం వెనుక బలమైన కారణం వుంది. 2020, మార్చిలో మాచర్లలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు తదితరులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు దాడికి పాల్పడిన వారిలో ప్రధానంగా వైసీపీ కౌన్సిలర్ తురకా కిశోర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అతను వడ్డెర సంఘం నాయకుడు. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కూడా.
ఇతను వడ్డెరకాలనీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వడ్డెరకాలనీకి వెళితే ఎలాగైనా తమను అడ్డుకుంటారని, దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చని టీడీపీ రచించిన వ్యూహం ప్రకారమే అంతా జరిగింది. చివరికి ప్రజలకు అశాంతి కరువైంది. మాచర్లలో టీడీపీ, వైసీపీ పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
అలాగే ఇరు పార్టీల నాయకుల ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మాచర్ల నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకుంది. మాచర్లలో చెలరేగిన నిప్పులో టీడీపీ చలి కాచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అసలే టీడీపీ నాటకాలు ఆడడంలో దిట్ట అని, ఇక ఇళ్లు, కార్యాలయాల దహనాలకు పాల్పడితే దాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసంటున్నారు. అధినాయకుల రాజకీయ ప్రయోజనాల కోసం కిందిస్థాయిలో కార్యకర్తలు మానసిక, శారీరక క్షోభ అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది.