గత రాత్రి మాచర్లలో టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి చావు పరుగు తీశారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన తెల్లవారి సూర్యున్ని చూసి వుండే అదృష్టం లేకపోయేది. చంద్రబాబు, లోకేశ్ వద్ద మార్కులు వేయించుకునే క్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డి చేజేతులా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్లలో శుక్రవారం నాటి ఉద్రిక్త పరిణామాలను ఎవరూ కోరుకోరు. ఇలాంటివి పునరావృతం కావడం రాజకీయాలకు, సమాజానికి మంచిది కాదు.
ఈ దుర్ఘటనలో పార్టీల తప్పొప్పుల గురించి మాట్లాడ్డం వృథా. ఎందుకంటే ఎవరూ తమది తప్పని ఒప్పుకోరు. తమ కోణంలో ఎలా రైటో చెబుతారు. కానీ వాస్తవాల గురించి మాట్లాడుకోవాలి. ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకపోవడం సంతోషించాల్సిన అంశం. వడ్డెరకాలనీకి ర్యాలీగా వెళుతున్నప్పుడు టీడీపీ మందీమార్బలంతో సిద్ధంగా ఉంది. చేతిలో కర్రలు, రాడ్లు ఉన్నాయి. అటు వైపు వైసీపీ కూడా అదే రకంగా సన్నద్ధంగా వుంది.
రాళ్లు, కర్రలు, సీసాలతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇరు వైపు కార్యకర్తలు గాయపడ్డారు. ఇదే సందర్భంలో జూలకంటి బ్రహ్మారెడ్డిని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేశారు. ఆయన కోసం వైసీపీ కార్యకర్తలు వెతికారు. నిజానికి బ్రహ్మారెడ్డిని పోలీసులు తప్పించారనే ప్రచారం జరుగుతోంది. కానీ అది వాస్తవం కాదు. ఆయనే రాయవరం మీదుగా మంగళగిరిలో పడ్డారు. రాయవరం వరకూ బ్రహ్మారెడ్డి కోసం వైసీపీ కార్యకర్తలు వేటాడారు. అదృష్టవశాత్తు ఆయన దొరకలేదు. చావు భయంతో బ్రహ్మారెడ్డి పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రస్తుతం బ్రహ్మారెడ్డితో పాటు మరికొందరు మాచర్లకు చెందిన ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకులు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో తల దాచుకున్నట్టు సమాచారం. అయితే ఆయన కనిపించలేదని టీడీపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. బ్రహ్మారెడ్డి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వైసీపీ కంటే టీడీపీపై ఎక్కువగా వుంది. ఎందుకంటే నమ్ముకున్నోళ్ల ఊపిరి తీసి, అధికారమనే దానికి ప్రాణం పోసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే బ్రహ్మారెడ్డి వైసీపీతో పాటు టీడీపీ నుంచి కూడా ప్రాణాలను కాపాడుకోవాల్సి వుంది.