క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అందుబాటులో లేరు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి మంచుపర్తి అనురాధకు ఓటు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి అని వైసీపీ అధిష్టానం నిర్ధారించింది.
ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడైన మరుక్షణం మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదృశ్యమయ్యారు. ముందు నుంచీ వైసీపీలో వీళ్లిద్దరిపై అనుమానాలున్నాయి. అయితే ఉండవల్లి శ్రీదేవి మాత్రం తాను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయలేదని బుకాయించారు. దళిత ఎమ్మెల్యే కావడంతోనే అభాండాలు వేస్తున్నారని దబాయించారు. చివరికి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందెవరో పార్టీ తన మార్గంలో తేల్చేసింది.
ముఖ్యంగా చంద్రశేఖరరెడ్డి విషయానికి వస్తే… తన సీటుకు ఎసరు పెట్టారనే ఆగ్రహంతో ఉన్నారు. కుటుంబంలో వివాదాలు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యతిరేకత పెంచుకోడానికి కారణమయ్యాయి. మేకపాటి భార్యగా చెప్పుకుంటున్న శాంతమ్మకు మార్కెట్‌యార్డ్ చైర్‌పర్సన్ పదవి ఇప్పించుకోవాలని ఆయన ప్రయత్నించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒప్పుకోలేదు. మేకపాటి చంద్రశేఖరరెడ్డిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ విషయాలన్నీ జగన్ ఎప్పటికప్పుడు చెబుతూ అప్రమత్తం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఎటూ తనకు వైసీపీలో భవిష్యత్ లేదనే నిర్ణయానికి మేకపాటి వచ్చినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అందుకే టీడీపీతో టచ్‌లోకి ఆయన వెళ్లినట్టు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన బయటపడ్డారు. ఫలితాల వెల్లడైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, ఎక్కడికో వెళ్లిపోయారని సన్నిహితులు చెబుతున్నారు.