పత్రిక ప్రతులను చించేసిన మంత్రి

తమ ప్రభుత్వం మీద అసత్యాలు రాస్తున్నారు అంటూ వైసీపీ మంత్రి మండిపోయారు. మీడియా సమావేశంలోనే ఏపీలో ఒక ప్రధాన  పత్రిక ప్రతులను అడ్డంగా చించేశారు. ప్రభుత్వం మీద నిరంతరం బురద జల్లడమే తెలుగుదేశానికి కొమ్ము…

తమ ప్రభుత్వం మీద అసత్యాలు రాస్తున్నారు అంటూ వైసీపీ మంత్రి మండిపోయారు. మీడియా సమావేశంలోనే ఏపీలో ఒక ప్రధాన  పత్రిక ప్రతులను అడ్డంగా చించేశారు. ప్రభుత్వం మీద నిరంతరం బురద జల్లడమే తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్న కొన్ని పత్రికల పని అని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ విమర్శించారు.

తాము ఎంతో కష్టపడి ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూంటే ఏపీ ఇమేజ్ ని దెబ్బతీయాలని కొన్ని పత్రికలు పనిగట్టుకోవడం బాధాకరమని అన్నారు. తమ రాతలతో ఏపీ భవిష్యత్తుని కాలరాసేందుకు ప్రయత్నిస్తారా అని ఆయన ప్రశ్నించారు. నిత్యం అసత్యాలను ప్రచురిస్తూ తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. దాని వల్ల ఏపీ ఫ్యూచర్ ఇమేజ్ కూడా పాడవుతున్న సంగతిని విస్మరించడమే విషాదకరమని ఆయన అన్నారు

విశాఖలో పెట్టుబడుల సదస్సు విజయవంతం కాకూడదనే వారి ఆలోచన అన్నారు. ప్రభుత్వం ఏది మంచి చేసినా చెడుగా చిత్రీకరించడమేంటని మంత్రి అంటున్నారు. నిన్నటికి నిన్న గన్నవరంలో జరిగిన ఒక ఘటన విషయంలో పాత ఫోటోలను ప్రచురించి ఒక  ప్రధాన  పత్రిక తన విశ్వసనీయతను కోల్పోయిందని మంత్రి హాట్ కామెంట్స్ చేశారు.

ఈ విధంగా తప్పుడు రాతలతో సమాజానికి రాష్ట్రానికి ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించారు. విశాఖ వేదికగా జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ ద్వారా పారిశ్రామికంగా రాష్ట్రం ముఖచిత్రం మారబోతుందని మంత్రి చెప్పారు. అలా విభజన ఏపీకి మంచి జరుగుతుందని మంత్రి గుడివాడ అమరనాధ్ పేర్కొన్నారు. లక్షల పెట్టుబడులతో యువతకు ఉపాధి లభిస్తుందని అయితే వైసీపీ ప్రభుత్వం ఇంతలా తపన పడుతూంటే తప్పుడు ప్రచారం చేసి చెడగొట్టాలని కొన్ని పత్రికలు చూడడం దురదృష్టకరమని మంత్రి అన్నారు.