వారూ వీరూ రోడ్డు మీద పడ్డారు!

ఒక వైపు వేసవి వేడిమి మొదలైంది. ఏపీలో ఎన్నికల వేడి ఎపుడో మొదలైంది. ముందస్తు ఎన్నికలు అంటూ గత మూడేళ్ళుగా హడావుడి చేస్తూనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఏడాది దూరంలోకి వచ్చింది. ఈ ఏడాది…

ఒక వైపు వేసవి వేడిమి మొదలైంది. ఏపీలో ఎన్నికల వేడి ఎపుడో మొదలైంది. ముందస్తు ఎన్నికలు అంటూ గత మూడేళ్ళుగా హడావుడి చేస్తూనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఏడాది దూరంలోకి వచ్చింది. ఈ ఏడాది కూడా వైసీపీ పాలనే సాగుతుంది. 2024లోనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయి.

ఇపుడు సెమీ ఫైనల్స్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలను కవర్ చేస్తూ లోకల్ బాడీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రా ఇపుడు అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలకు కీలకంగా మారింది.

ఉత్తరాంధ్రాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుని గెలవాలని రెండు పార్టీలూ మోహరించాయి. దాంతో ఎన్నడూ చూడని సన్నివేశాలు ఇపుడు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు మొదలుకుని నాయకులు అంతా రోడ్ల మీదకు వచ్చేశారు.

తెలుగుదేశం వైపు నుంచి చూస్తే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద నాయకులు అంతా ఎమ్మెల్సీ ఎన్నికల జపం చేస్తున్నారు. మాటల తూటాలు అటూ ఇటూ గట్టిగానే పేలుతున్నాయి. ఈ ఒక్క ఎన్నికతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోతుంది అన్నంతగా టీడీపీ హడావుడి చేస్తోంది.

వైసీపీ విషయానికి వస్తే ఉత్తరాంధ్రాలో తమ పట్టుని నిలబెట్టుకుని మరోసారి ఓటమిని టీడీపీకి చూపించాలని తాపత్రయపడుతోంది. వైసీపీ, టీడీపీ రాజకీయ సమరాంగణ వేదికగా ఉత్తరాంధ్రా నిలిచి ఉంది. ఈ సీట్లో రెండు పార్టీలు మొదటిసారి పోటీకి దిగుతున్నాయి.

మామూలుగా అయితే వామపక్షాలు, లేకపోతే బీజేపీ అభ్యర్ధులే ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది. ఇపుడు దాన్ని తిరగరాసి సంప్రదాయ పార్టీలు గెలవాలనుకుంటున్నాయి. ఉత్తరాంధ్రాలో ఎమ్మెల్సీ సందడి చూస్తే రేపటి ఎన్నికలు ఇంతకు వేయింతల వేడితో ఉంటాయని చెప్పకతప్పదు. 

గెలుపు కోసం మోహరించి ఉభయ పక్షలా నడుమ వామపక్షాలు బీజేపీ కూడా రేసులో ఉన్నాయి. విజేత ఎవరు అన్నది మార్చి 13న పోలింగుతో బయటపడుతుంది.