తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా తాను ఉండగా, అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి, వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు.
తనపై విమర్శలు చేస్తున్న శ్రీదేవి, ఆమె అనుచరులపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే కాకుండా, అభిమానాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ధోరణే శ్రీదేవిని ఇరకాటంలో పడేస్తోంది. విమర్శలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందిస్తే, ఆయనపై పదింతలు రియాక్ట్ కావచ్చని శ్రీదేవి, ఆమె అనుచరులు అనుకున్నారు.
అనూహ్యంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిమానాన్ని ప్రదర్శిస్తూ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. 2024లో ఎటూ తనకే టికెట్ అని, అలాంటప్పుడు శ్రీదేవితో గొడవ ఎందుకనే ఉద్దేశంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలివిగా ప్రకటనలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు.
ఇవాళ డొక్కా మాణిక్య వరప్రసాద్ మరోసారి తాడికొండలో తన నియామకంపై స్పందించారు. శ్రీదేవి నాయకత్వంలో తాను కూడా పని చేస్తానని స్పష్టం చేశారు. ఆమెను కొందరు పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాల్ని వ్యక్తం చేయడం గమనార్హం. శ్రీదేవిని తనే స్వయంగా ఎమ్మెల్యే జగన్ వద్దకు తీసుకెళ్తానన్నారు. ఆమెతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఏవైనా ఉన్నా అన్నీ సర్దుకుంటాయన్నారు. శ్రీదేవితో కలిసి వైసీపీ బలోపేతానికి పని చేస్తానన్నారు.
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అంటే తనకు గౌరవమన్నారు. ఆయన తనకు రాజకీయ గురువని చెప్పారు. అలాగే వైఎస్ జగన్ తనకు బాస్ అని తేల్చి చెప్పారు. జగన్ నాయకత్వంలో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి పని చేస్తానని స్పష్టం చేశారు.