ఏ దేశమేగినా …ఎందు కాలిడినా ఆమె తీరు ఇంతే

సాధారణంగా మన దేశంలోని ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు రెండు పనులే చేస్తారు. ఒకటి… సొంత పార్టీ అధినేతను ఆకాశానికి ఎత్తడం. పొగడ్తల జల్లులు, ప్రశంసల వర్షం కురిపించడం. రెండోది …ప్రత్యర్థి పార్టీలను…

సాధారణంగా మన దేశంలోని ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు రెండు పనులే చేస్తారు. ఒకటి… సొంత పార్టీ అధినేతను ఆకాశానికి ఎత్తడం. పొగడ్తల జల్లులు, ప్రశంసల వర్షం కురిపించడం. రెండోది …ప్రత్యర్థి పార్టీలను (సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాన్నే) విమర్శలతో, బూతులతో కడిగిపారేయడం. 

గల్లీ నాయకుల నుంచి మంత్రులవరకు ఇదే పని. ప్రెస్ మీట్ లో కావొచ్చు, ప్రభుత్వ కార్యక్రమం కావొచ్చు, పుణ్య క్షేత్ర సందర్శన కావొచ్చు …ఎక్కడైనా ఇదే సోది. ఇంతకు మించి వారికి చెప్పడానికి వేరే అంశమే దొరకదు. మంత్రులైతే వారి శాఖల గురించి, డెవెలప్ మెంట్ గురించి ఒక్క మాటా మాట్లాడరు. నాయకుల తీరు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఒకే తీరుగా ఉంటుంది.

గతంలో తెలుగు పాఠ్య పుస్తకాల్లో రాయప్రోలు సుబ్బారావు రాసిన ఏ దేశమేగినా/ ఎందు కాలిడినా/ ఏ పీఠమెక్కినా/ ఎవ్వరెదురైనా/ పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే గేయం ఉండేది. దీన్నే రాజకీయ నాయకులకు అన్వయించుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్లినా పార్టీ అధినేతను పొగడటమే పనిగా పెట్టుకుంటారు. అలా వీర లెవెల్లో అరివీరభయంకరంగా పార్టీ అధినేతను పొగిడే వైసీపీ నాయకుల్లో (ఇప్పుడు మంత్రి కూడా ) రోజా ఒకరు. ఆమె ఏ పార్టీలో ఉంటే అధినేతను ఇలాగే పొగుడుతుంటుంది. ఆమె పొగడ్తలు కానీ, బూతులు కానీ వీర లెవెల్లోనే ఉంటాయి. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్సార్ ను బూతులు తిట్టింది. జగన్ పార్టీలో చేరాక చంద్రబాబును బూతులు తిడుతోంది.

చట్ట సభలోనైనా తిట్టడానికి వెనుకాడదు. ఆమె ఒక పెక్యులియర్ క్యారెక్టర్. రోజా ఆస్ట్రేలియాకు వెళ్ళింది. భర్త సెల్వమణి కూడా వెళ్ళాడులెండి. అక్కడి ప్రవాసాంధ్రులు పిలిచారట. అక్కడికి వెళ్లినా ఆమె రొటీన్ సోది ఆపలేదు. ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తింది. టీడీపీని ప్రత్యేకంగా చంద్రబాబును, లోకేష్ ను ఘాటుగా విమర్శించింది. అక్కడ వైసీపీ అభిమానులు కోరుకున్న విధంగా పంచ్ లతో ప్రసంగించింది.  

పేగు పంచిన విజయమ్మ, రక్తం పంచిన రాజన్న, పురుడు పోసిన పులివెందుల, పట్టం కట్టిన ఆంధ్ర రాష్ట్రం గర్వపడేలా జగనన్న పరిపాలిస్తున్నారని అన్నది. దేశం కోసం యుద్ధం చేస్తే అతను సైనికుడు అని.. ధర్మం కోసం యుద్ధం చేస్తే అతను రాముడని.. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడితే అతను నాయకుడని.. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నది. 

ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాల గురించి వివరించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి, నాయకుడంటే ఇలా ఉండాలని జగన్ నిరూపించారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి తన పథకాలు అమలు తీరు తెలుసుకొనేందుకు గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్నారని చెప్పింది.  

విదేశీ చదువులకు విదేశీ విద్య దీవెన ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. 2024 లోను ఇలాంటి జనరంజకమైన పాలన కొనసాగడానికి ఎన్నారైలు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా తనకు అండగా నిలవాలంటూ కోరింది. జగన్ స్థాపించిన పార్టీలో పని చేస్తున్నందుకు గర్వపడుతన్నామని చెప్పింది. ఇదండీ రోజా సంగతి.