చంద్రబాబును ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను ఆరా తీశారట! లోకీ ఎలా ఉన్నాడని ప్రత్యేకంగా అడిగినట్టు సమాచారం. బాగా సన్నబడ్డాడని, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నాడని మోదీతో చంద్రబాబు అన్నట్టు తెలిసింది (గమనికః ఎల్లో మీడియా రాయని నిజాలు).
బాబును మోదీ పలకరించడంపై ఎల్లో మీడియా ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఎన్టీఏ నుంచి టీడీపీ బయటికొచ్చి దాదాపు ఐదేళ్లు సమీపిస్తోంది. అప్పటి నుంచి ఏడాదిన్నర పాటు మోదీతో చంద్రబాబు యుద్ధం చేశారు. చివరికి చంద్రబాబు ఓడిపోయి జ్ఞానోదయం పొందారు. మరోసారి ఎన్నికల సమరానికి సన్నద్ధం కావాల్సిన పరిస్థితి. అయితే కేంద్రంలో పాలన సాగిస్తున్న బీజేపీతో శత్రుత్వం పెట్టుకుంటే, మరోసారి ఓటమి తప్పదని గ్రహించారు. దీంతో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా చల్లని చూపు కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దేశ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వెళ్లారు. అందర్నీ ప్రధాని మోదీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. అయితే చంద్రబాబును కాస్త ప్రత్యేకంగా చూశారని ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి ఏకాంత చర్చలు జరిపారని వారాంతపు పలుకుల సార్ పత్రిక రాయడం విశేషం. ‘చంద్రబాబు గారూ… ఎలా ఉన్నారు! మనం చాలా రోజులు అయ్యింది కలుసుకొని. మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదు?’ అని బాబును ప్రధాని అడిగినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని సదరు పత్రిక రాసుకొచ్చింది. అంతేకాదు, ‘మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది’ అని ప్రత్యేకంగా రాయడాన్ని గమనించొచ్చు.
ఇక చంద్రబాబు రాజగురువు పత్రిక మాత్రం… టీడీపీ వర్గాల ద్వారా అందిన సమాచారం అంటూ నిజాన్ని బయటపెట్టింది.
‘ అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ వుండండి. ఇది మీ ఇల్లు అనుకోండి’ అని బాబుతో ప్రధాని అన్నారట. బాబును పైకి లేపేందుకు ప్రధానితో సమావేశాన్ని అవకాశంగా తీసుకున్నారు. బాబుతో నిజంగా ప్రత్యేకంగా మాట్లాడాలనే కోరిక ప్రధానిలో వుంటే గత మూడేళ్లుగా కనీసం అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. చంద్రబాబుతో ప్రధాని ఏం మాట్లాడారో బీజేపీ పెద్దలు లేదా పీఎం కార్యాలయమో చెప్పి వుంటే బాగుండేది.
అలా కాకుండా టీడీపీ వర్గాలు చెప్పినట్టు… ఏం రాసినా ప్రయోజనం లేదు. పైగా ఇది సొంత డబ్బా అనే అభిప్రాయం కలగకుండా ఉండదు. ఈ ప్రమాదాన్ని గుర్తించి ‘వీకెండ్’ సార్ పత్రిక ‘విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం’ అని ప్రత్యేకంగా రాయడం. మోదీని బాబు కలవడం మాత్రం ఎల్లో బ్యాచ్లో ఐదేళ్లకు ప్రియుడిని కలిసిన అనుభూతి చూడొచ్చు.