భారతీయ జనతా పార్టీ రాజకీయంలో సీఎంలది నామమాత్రపు పాత్ర అవుతోందా? రాష్ట్రాలకు రాజధానులు, రాజధానుల్లో కమలం పార్టీ ముఖ్యమంత్రులే ఉన్నా.. వారిని నడిపించేది మాత్రం ఢిల్లీనేనా! దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో చీమ చిటుక్కుమనాలన్నా.. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాల్సిందేనా? ఒక రాష్ట్రంలో కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ రాజకీయ కదలికలను గమనిస్తే వచ్చే సందేహాలు ఇవి.
గతంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉండేవి. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. అంతిమ నిర్ణయాలు ఢిల్లీ నుంచినే వెలువడేవి. సోనియా కనుసన్నల్లో కాంగ్రెస్ వ్యవహారాలు కొనసాగాయి. అవి అంతిమంగా కాంగ్రెస్ కు తీవ్రనష్టమే చేశాయి తప్ప మరో ప్రయోజనాన్ని కలిగించలేదనేది సత్యం. కాంగ్రెస్ సంగతలా ఉంటే.. ఇప్పుడు బీజేపీ వ్యవహారాలన్నీ అంతా సీల్డ్ కవర్ గా మారాయి. ఢిల్లీ నుంచి ఏం చెబితే అది రాష్ట్రాల్లో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది.
కమలం పార్టీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయాలకు ఇప్పటికే తిలోదకాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎవరనేది అనవసరం .. అంతా మోడీ ఫొటోనే ఉంటుంది. మోడీని చూసి బీజేపీకి ఓట్లేస్తే.. ఆ తర్వాత సీఎం సీట్లో ఎవరు కూర్చోవాలో కమలం పార్టీ హైకమాండ్ ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇస్తుంది అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది.
కొన్ని రాష్ట్రాల్లో అయితే.. అప్పటికప్పుడు ఎవరినో సీఎం సీట్లో కూర్చోబెడతారు. అవతలి ప్రభుత్వాన్ని కూల్చి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఎవరినో జనామోదం కోసం సీఎంగా కూర్చోబెడతారు. ఆ తర్వాత కొంతకాలానికి వారికి ప్రాధాన్యత తగ్గిపోతుంది. కనీసం కేబినెట్ విషయంలో కూడా వారి అభిప్రాయానికి విలువను ఇవ్వరు.
యడియూరప్ప వ్యవహారంలో ఇలానే జరిగింది. కాంగ్రెస్- జేడీఎస్ ల సంకీర్ణ సర్కారును కూల్చేసిన సందర్భంలో యడియూరప్ప అవసరం బీజేపీ హైకమాండ్ కు ఏర్పడింది. దీంతో 75 యేళ్ల వయసు దాటేసినా.. ఆయనకు సీఎం పీఠాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం గాడిన పడింది, యడియూరప్పపై వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో ఆయనను దించే కొత్త సీఎంను అయితే నియమించారు. అప్పటి నుంచి కర్ణాటకలో అంతా ఢిల్లీ ఆదేశాలనుసారమే రాజకీయం కొనసాగుతూ ఉంది. సీఎం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాల్సిందే!
ఇక తాజాగా ఇలాంటి వరసలోనే చేరింది మహారాష్ట్ర కూడా! మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్- ఎన్సీపీల మహా కూటమి ప్రభుత్వాన్ని ఇటీవలే తిరుగుబాటు వర్గం సహకారంతో బీజేపీ కూల్చేసింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన తిరుగుబాటు దారుడిని బీజేపీ మహా సీఎంగా చేసింది. ఇది కూడా ఢిల్లీ నిర్ణయమే. ఇక ఇప్పుడు కేబినెట్ కూర్పుకు కూడా ఢిల్లీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. కొత్త కేబినెట్ జాబితాతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎవరు కేబినెట్లో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ఢిల్లీనే నిర్ణయిస్తుంది!
గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులను హైకమాండే నియమించినా, ఆ తర్వాత వారికి ఎంతో కొంత ఫ్రీ హ్యాండ్ ఉండేది. కనీసం కేబినెట్ ను ఏర్పరుచుకోవడంలో అయినా.. వారికి స్వతంత్రం ఉండేది. ఏదో మర్యాదమాత్రంగా ఢిల్లీకి జాబితాను పంపించే వారు. మరీ అవసరమైన రాష్ట్రాల్లోనే హైకమాండ్ జోక్యం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు కేబినెట్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఢిల్లీలోనే నిర్ణయించే పరిస్థితి ఉన్నట్టుంది.
కేవలం కర్ణాటక, మహారాష్ట్రల్లోనే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చేయడం, ఎన్నికలకు ఏడాది ముందే ఢిల్లీ పెద్దలు ఆ రాష్ట్రంలో దిగిపోయి.. మొత్తం రాజకీయాన్ని కనుసన్నల్లో నడిపించడం కూడా జరిగాయి. తమది వ్యక్తి స్వామ్యం కాదని, తమది ఆర్ఎస్ఎస్ వేసిన పునాది అన్నట్టుగా బీజేపీ వ్యవహరాలు గతంలో ఉండేవి. అయితే ఇప్పుడు అంతా ఢిల్లీ కనుసన్నల్లో అన్నట్టుగా కాంగ్రెస్ విధానాన్ని బీజేపీ ఫాలో అవుతున్నట్టుగా ఉంది.