కడప జిల్లా జమ్మలమడుగులో పోటీపై మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పష్టత ఇచ్చారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ పరిస్థితి ఏంటనే చర్చకు తెరలేచింది. వివిధ కారణాల వల్ల ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు.
కానీ ఆయన అన్నదమ్ములు మాత్రం టీడీపీ పంచన చేరారు. ఆది అన్న, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆదినారాయణరెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని అందరూ భావించారు. అయితే తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించడంతో జమ్మలమడుగు టీడీపీలో అయోమయం నెలకుంది.
ఇతర పార్టీలను కలుపుకుని వైసీపీని ఇంటికి సాగనంపుతానని ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకోడానికి ఆదినారాయణరెడ్డి ఆసక్తి చూపుతున్నారు. అందుకే పదేపదే పరోక్షంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఆదినారాయణరెడ్డి పోటీలో ఉంటే, భూపేష్ తప్పుకుంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
ఏది ఏమైనా జమ్మలమడుగులో బాబాయ్, అబ్బాయ్లలో ఎవరు నిలుస్తారనే చర్చకు తెరలేచింది.