నీట్ పేపర్ లీకేజీపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్రాన్ని నిగ్గదీశారు. ప్రజాసమస్యల్ని అత్యున్నత చట్టసభ ద్వారా మోదీ సర్కార్ దృష్టికి తీసుకెళ్లడంలో గురుమూర్తి ముందు వరుసలో వుంటున్నారు. అందుకే ఆయన్ను తిరుపతి పార్లమెంట్ ప్రజలు ఎన్నికల్లో అక్కున చేర్చుకున్నారు.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీకేజీపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లోక్‌సభలో గురుమూర్తి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే లోక్‌సభ సమావేశాల్ని ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేయడం, అలాగే ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై సుదీర్ఘ ప్రసంగించడంతో ఎంపీలెవరికీ సమయం ఇవ్వలేదు.
అయితే ప్రసంగ పాఠానికి సంబంధించి పేపర్లను కేంద్ర ప్రభుత్వానికి తిరుపతి ఎంపీ సమర్పించడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తదితర కేంద్ర పెద్దలకు తిరుపతి ఎంపీ వినతిపత్రాలు సమర్పించారు. అందులో ఏముందంటే.. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేపట్టినందుకు ముందుగా కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ)లో తక్షణం సంస్కరణలు అవసరమని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అన్నారు.
దేశ వ్యాప్తంగా 24 లక్షల మంది వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాయడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నీట్ పేపర్ లీక్ కావడం విద్యార్థుల కుటుంబాల్లో కలకలం రేపిందన్నారు. పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నీట్ ప్రవేశ పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తడం, అలాగే యూజీసీ-నెట్ పరీక్ష కూడా రద్దు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిణామాలు ఏళ్ల తరబడి కఠోర శ్రమ చేస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేశాయని గురుమూర్తి వెల్లడించారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు విలువైన సమయాన్ని పెట్టుబడిగా పెట్టారని ఆయన గుర్తు చేశారు.
జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ)లో వ్యవస్థాగత సమస్యలను తెలియజేస్తోందని గురుమూర్తి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ పరీక్షా సంస్థపై ప్రజల విశ్వాసం, నమ్మకం పోయేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి… యావత్ దేశం విశ్వాసాన్ని చూరగొనేలా అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పరీక్షా విధానాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడం, విద్యార్థులతో స్పష్టమైన కమ్యూనికేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బలమైన సంస్కరణలు, పారదర్శకత నెలకొల్పొచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు నిపుణుల సలహా మండలిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పరీక్షల షెడ్యూల్‌ను నవీకరించడంతో పాటు దర్యాప్తు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్.టి.ఏ.) పై ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలని కోరారు. అలాగే ఔత్సాహిక వైద్య విద్యార్థుల కలలను కాపాడాలన్నారు.