తిరుమల అడిషనల్ ఈవోగా వెంకన్న చౌదరిని నియమించే అవకాశాలున్నాయి. టీటీడీ ఈవోగా శ్యామలారావును నియమించిన సంగతి తెలిసిందే. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వెంకన్న చౌదరి విజయవాడలో కస్టమ్స్ విభాగంలో ఉన్నతాధికారి. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వెంకన్న చౌదరి మంచి ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. అలాగే వ్యక్తిగతంగా అందరినీ కలుపుకుని పోయే స్వభావం ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
నిజానికి తిరుమల జేఈవోగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ గత ప్రభుత్వం ధర్మారెడ్డిని నియమించి, ఆయన కోసం అడిషనల్ ఈవో పోస్టును క్రియేట్ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటికీ అడిషనల్ ఈవో పోస్టును రద్దు చేయలేదు. దీనికి కారణం ఐఆర్ఎస్ అధికారి అయిన వెంకన్న చౌదరిని నియమించేందుకే అని చెబుతున్నారు.
తిరుమలలో దర్శనాలు, ఇతరత్రా విషయాల్లో పద్ధతి ప్రకారం చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఉత్సాహం చూపుతోంది. కోట్లాది మంది దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకే వెంకన్న చౌదరికి బాధ్యతలు అప్పగించనున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.
త్వరలో ఆయన నియామకం జరుగుతుందని తెలిసింది. గత ప్రభుత్వం తిరుమల విషయంలో చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావు. ధర్మారెడ్డి వైఖరితో జగన్ సర్కార్ కావాల్సినంత చెడ్డపేరు మూటకట్టుకుంది. ఆ తప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం చేయదని టీడీపీ నేతలు అంటున్నారు.