బాబుపై ఎవ‌రో మాట్లాడితే వైసీపీ సంబ‌ర‌ప‌డాల్సిందే!

దేశంలోని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ లోక్‌స‌భా వేదిక‌గా చంద్ర‌బాబుపై తృణ‌ముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబును అవినీతిప‌రుడిగా చిత్రీక‌రించారు. అలాంటి నాయ‌కుల‌తో పొత్తు కుదుర్చుకున్నార‌ని ప్ర‌ధాని మోదీని ఆయ‌న దెప్పి పొడిచారు.…

దేశంలోని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ లోక్‌స‌భా వేదిక‌గా చంద్ర‌బాబుపై తృణ‌ముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ క‌ల్యాణ్ బెన‌ర్జీ విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబును అవినీతిప‌రుడిగా చిత్రీక‌రించారు. అలాంటి నాయ‌కుల‌తో పొత్తు కుదుర్చుకున్నార‌ని ప్ర‌ధాని మోదీని ఆయ‌న దెప్పి పొడిచారు. టీఎంసీ ఎంపీ అనూహ్యంగా సీఎం చంద్ర‌బాబునాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో టీడీపీ షాక్‌కు గురైంది.

మ‌రో వైపు వైసీపీ సంబ‌ర‌ప‌డ‌డం విశేషం. జాతీయ స్థాయిలో వైసీపీది విచిత్ర‌మైన రాజ‌కీయ పంథా. ఇటు ఇండియా కూట‌మి, అటు ఎన్డీఏ కూట‌మికి దూరంగా వుంటోంది. అయితే వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల రీత్యా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న ఎన్డీఏతోనే వైసీపీ అంట‌కాగుతోంది. గ‌తంలో ప్ర‌తిప‌క్ష స్థానంలో ఉన్న టీడీపీది కూడా ఇదే ప‌రిస్థితి. అందుకే ఏపీలోని 25కు 25 ఎంపీ సీట్లు బీజేపీవే అని రాజ‌కీయ విశ్లేష‌కులు, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ లాంటి సీనియ‌ర్ నాయ‌కులు విమ‌ర్శిస్తుంటారు.

రాజ‌కీయంగా ఒంట‌రిత‌నం ఏ పార్టీకైనా మంచిది కాదు. ఎన్డీఏకు వైసీపీ మ‌ద్ద‌తుగా నిలిచినా, ఇండియా కూట‌మితో స్నేహ సంబంధాలు కొన‌సాగించ‌డానికి ఇబ్బంది ఉండ‌దు. కానీ ఆ ప‌ని వైసీపీ ఎంపీలు చేయ‌డం లేదు. త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసుల్ని కాంగ్రెస్ పెట్టించింద‌ని, అందుకే ఆ పార్టీ నేతృత్వం వ‌హిస్తున్న ఇండియా కూట‌మికి దూరంగా వైసీపీ ఎంపీలు ఉంటున్నారు.

ఇండియా కూట‌మి నేత‌ల‌తో క‌నీసం స్నేహ సంబంధాలు వుంటే, జాతీయ స్థాయిలో వైసీపీకి మంచి జ‌రిగేది. టీఎంసీ ఎంపీ త‌న‌కు తానే చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌డం ట్రైల‌ర్ మాత్ర‌మే. వైసీపీ రాజ‌కీయాన్ని రాజకీయంగా చేస్తున్న‌ట్టైతే, ఒంట‌రిత‌నం వుండేది కాదు. ఇప్పుడు త‌మ ప్ర‌త్య‌ర్థిపై ఎవ‌రో మాట్లాడితే సంబ‌ర‌ప‌డ‌డం త‌ప్ప‌, ఇందులో త‌మ గొప్ప‌త‌నం లేద‌ని వైసీపీ ఎంపీలు అంటున్నారు. కావున రానున్న రోజుల్లో వైసీపీ జాతీయ‌స్థాయిలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలుంటాయి. అలా కాకుండా తాము ఒంట‌రే అని భీష్మించుకుని కూచుంటే మాత్రం , దాన్ని ప్ర‌త్య‌ర్థులు సొమ్ము చేసుకుంటారు.