ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం (ఇవాళ) సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారికంగా మొదటి ఢిల్లీ పర్యటన. ఢిల్లీలో రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులతో చంద్రబాబు భేటీ కానున్నారు. బాబు వెంట ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్‌రెడ్డి వెళ్లనున్నారు.
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, రాజధాని అమరావతి నిర్మాణాకి భారీ నిధులు రాబట్టుకునే విషయమై చంద్రబాబు చర్చించనున్నారు. ప్రధాని, కేంద్రమంత్రులతో ఏపీకి సంబంధించి చంద్రబాబు కీలక చర్చలు జరపనున్న నేపథ్యంలో తన వెంట ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు ఎప్పుడెళ్లినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తీసుకెళ్లడం చూశాం. కానీ పవన్‌ను ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు పక్కన పెడుతున్నారనేందుకు తన వెంట ఢిల్లీకి తీసుకెళ్లకపోవడమే నిదర్శనం అనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు తన వెంట కేవలం టీడీపీ మంత్రుల్ని మాత్రమే తీసుకెళ్లడాన్ని గమనించొచ్చు.
కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనేదే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎజెండా అయితే, తమ నాయకుడైన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కూడా వెంట తీసుకెళ్లే వారని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు తీరు చూస్తుంటే పవన్‌ను ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలనే అభిప్రాయంలో ఉన్నట్టు అర్థమవుతోందని జనసేన నాయకులు చెబుతున్నారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి వాణిజ్య ప్రకటనలో పవన్ పేరు లేదని, అలాగే చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించి ప్లెక్సీలో కూడా డిప్యూటీ సీఎం ఫొటోను విస్మరించారని జనసేన నాయకులు అంటున్నారు.
టీడీపీతో పొత్తు వద్దేవద్దని బీజేపీ చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల చీవాట్లు తిని, చివరికి తమను కలిపిన నాయకుడు పవన్ అనే సంగతి అప్పుడే టీడీపీ పెద్దలు విస్మరించారని జనసేన నేతలు వాపోతున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఒకే పార్టీకి చెందినప్పటికీ, ఇద్దరూ కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లి, కేంద్ర పెద్దల్ని కలిసిన వైనాన్ని జనసేన నాయకులు గుర్తు చేస్తూ, పవన్‌ను పక్కన పెడుతున్నారనే అనుమానాలకు బలం కలిగించేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. తన వెంట పవన్‌ను ఎందుకు తీసుకెళ్లలేదో చంద్రబాబు చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు.