నాదెండ్ల ….ఇదేం రాజకీయ క్రీడ…?

రాజకీయ నాయకులు ఒక్కోసారి విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. వారు సవ్యంగా వ్యవహరిస్తేనే ఆశ్చర్యపడాలి. జనసేనలో నెంబర్ టూ, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ విముక్త…

రాజకీయ నాయకులు ఒక్కోసారి విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. వారు సవ్యంగా వ్యవహరిస్తేనే ఆశ్చర్యపడాలి. జనసేనలో నెంబర్ టూ, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం అందరూ (అన్ని పార్టీలని అర్థం) ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రధానితో పవన్ జరిపిన సమావేశాన్నితమ పార్టీ గౌరవిస్తుందన్నారు. కానీ ప్రధానమంత్రితో పవన్ కల్యాణ్ ఏం చర్చించారు? ఏం మాట్లాడారు? అనే విషయాన్ని ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతామన్నారు. ఆ విషయాన్ని ఎవరితోను పంచుకోమని స్పష్టం చేశారు. ఆ విషయాన్ని బయటపెడితే ప్రధాని ఆగ్రహిస్తారని భయం కావొచ్చు.

మోడీతో పవన్ భేటీ నిర్ణయాలను జనసేన వెల్లడించదన్నారు. మోడీ…పవన కల్యాణ్ భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు. ఎన్నికల సందర్భంలో జరగాల్సిన చర్చను ఇప్పుడు తేవడం సరికాదని స్పష్టం చేశారు. ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా ఏపీని చేసే విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కూడా నాదెండ్ల స్పష్టం చేశారు. 

ఒకపక్కేమో వైసీపీని దించడానికి అన్ని పార్టీలు కలవాలంటారు. మరో పక్కేమో ఏ పార్టీలతో పొత్తులు ఉంటాయో చేప్పారు.  ఇదేం రాజకీయ క్రీడో అర్ధం కాకుండా ఉంది. నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీ-జనసేన పొత్తులకు ద్వారాలు తెరిచే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

అంతేకాకుండా పవన్ మోడీతో ఏం చర్చించారనేది మనోహర్ కు తెలుసు కాబట్టి ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారంటున్నారు. పవన్ ను చంద్రబాబు ట్రాప్ లో పడకుండా బీజేపీ నాయకులు చూస్తున్నారు. అందులో భాగమే పవన్ తో ప్రధాని భేటీ అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

ఈ భేటీలో గత రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబు వ్యవహార శైలి ప్రధాని మోదీ పవన్ కు గుర్తుకు తెచ్చినట్టు సమాచారం. అందుకే పవన్ కూడా జాగ్రత్త పడ్డారని.. అందులో భాగంగానే ఒక చాన్స్ అంటూ ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీకి పిలుపునిచ్చినందున పొత్తుల అంశాన్ని కూడా సజీవంగా ఉంచినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఒక వేళ పొత్తు అన్నది ఉన్నా అందులో కూడా చంద్రబాబును కేవలం ప్రేక్షక పాత్రగా ఉంచాలన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. ఇప్పుడు జగన్ మరోసారి అధికారంలోకి రాకూడదన్నది చంద్రబాబు ప్రధాన ధ్యేయం. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే ఆ అవసరాన్ని గుర్తెరిగి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. 

పవన్ ను అడ్డం పెట్టుకొని మరోసారి రాజకీయం చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ ద్వారానే కేంద్ర పెద్దల సాయం తీసుకోవాలని కూడా ప్లాన్ చేశారు. ఇప్పుడదే ప్లాన్ తో చంద్రబాబును అణిచివేయాలని కేంద్ర పెద్దలు చూస్తున్నారు. 

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారు. అదే బీజేపీ, జనసేన కలిసి నడిస్తే నువ్వే సీఎం క్యాండిడేట్ వు అంటూ పవన్ ఆలోచనను డైవర్ట్ చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీకి అడ్వాంటేజ్ కాకూడదని జనసేన భావిస్తోంది. అందుకే పవన్ నాదేండ్ల మనోహర్ తో ప్రకటన ఇప్పించారు. ఇప్పటికీ తాము వైసీపీ విముక్త ఏపీకి కట్టబుడి ఉన్నామని చెప్పించారు. 

అటు కేంద్ర పెద్దలు ఇచ్చిన డైరెక్షన్ పాటిస్తూనే.. పొత్తుల అంశాన్ని సజీవంగా ఉంచాలని భావిస్తున్నారు.