పుండు మీద కారం రాస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు!

నాగబాబు.. ఉద్దేశపూర్వకంగానే పిఠాపురం వర్మను మళ్లీ మళ్లీ అవమానించేందుకే ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబు తాను ఎమ్మెల్సీగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన తర్వాత.. తొలి కార్యక్రమంగా తన సొంత నియోజకవర్గం (!?) పిఠాపురం సందర్శిస్తున్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త నిర్మాణాలను ప్రారంభిస్తారు.

అంతా బాగానే ఉంది.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు.. పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మను అవమానించినట్టుగా పుండు పెట్టినట్టుగా తయారైన నేపథ్యంలో.. ఇప్పుడు నాగబాబు ప్లాన్ చేసిన పిఠాపురం పర్యటన ఆ పుండుమీద కారం రాస్తున్న తరహాలో సాగబోతున్నదని తెలుస్తోంది. పిఠాపురం వర్మను పూర్తిగా సైడ్ లైన్ చేస్తూ నాగబాబు అధికారిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా సమాచారం.

‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ తమవల్లే గెలిచాడని ఎవరైనా అనుకుంటూ ఉంటే గనుక.. అది వారి ఖర్మ’ అని వ్యాఖ్యానించడం ద్వారా.. నాగబాబు పిఠాపురం వర్మను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పేరు చెప్పకపోయినప్పటికీ.. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరికీ అర్థమైన సంగతి అది.

పాపం.. ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంలో ఒకవైపు చంద్రబాబునాయుడు పట్టించుకోకపోగా.. పవన్ కల్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉంటే తప్ప.. తనను చంద్రబాబు ఏ రకంగానూ పట్టించుకోడనే భయం పుట్టిన వర్మ వేరే గత్యంతరం లేని స్థితిలో పవన్ కల్యాణ్ బొమ్మను కూడా పెట్టుకుని.. నియోజకవర్గంలో ఫ్లెక్సిలు వేసుకుంటున్నారు. ఆయన జనసేనతో అతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సంకేతాలు ఉన్నాయి గానీ.. ఆ పార్టీ నాయకులు మాత్రం ఆయనను పూచికపుల్లమాత్రంగా కూడా పట్టించుకోవడం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో.. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అధికారికంగా పర్యటించనున్న నాగబాబు.. ఇటీవల వర్మకు కలిగించిన పుండు మీద ఇప్పుడు కారం రాస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారికంగానే పాల్గొంటున్నారు.. గానీ.. వర్మకు కనీసం ఆహ్వానం కూడా లేదు. ఇదే కార్యక్రమంలో జనసేన మరో ఎమ్మెల్సీ హరిప్రసాద్, పార్టీ నాయకులు వేములపాటి అజయ్ కుమార్, మర్రెడ్డి శ్రీనివాస్ అందరూ పాల్గొంటున్నారు. కానీ వర్మకు మాత్రం చోటు లేదు.

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు.. కూటమి పార్టీలకు చెందిన స్థానిక నాయకులకు కూడా ప్రాధాన్యం కల్పిస్తూ నిర్వహించడం ఒక సాంప్రదాయం. అయితే.. నాగబాబు.. ఉద్దేశపూర్వకంగానే పిఠాపురం వర్మను మళ్లీ మళ్లీ అవమానించేందుకే ఇలా చేస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఆమోదం లేకుండా.. నాగబాబు ఇలాంటి దూకుడు ప్రదర్శించరనే అభిప్రాయం కూడా తెలుగుదేశం వారిలో వ్యక్తం అవుతోంది.

9 Replies to “పుండు మీద కారం రాస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు!”

  1. 151 unna కుండకు పెద్దబొక్కపడి 11 చేరింది ఇలాగె చెత్తఅర్టికల్స్ రాస్తే ఈసారి జీరో నే

Comments are closed.