నమ్మకాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా లోకేష్!

దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ చిన్నబాబు నారా లోకేష్ నీతులు వల్లించడం, విలువలు వల్లించడం అనేది ఈ సామెతకు సరితూగుతుంది.…

దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ చిన్నబాబు నారా లోకేష్ నీతులు వల్లించడం, విలువలు వల్లించడం అనేది ఈ సామెతకు సరితూగుతుంది. ఆయన ఇప్పుడు నమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. గురివింద గింజ తన వీపు మీద ఉన్న నలుపు చూసుకోకుండా.. ఎదుటి గింజ నలుపు గురించి నవ్వినట్లుగా.. ఆయన తన తండ్రికి ఉన్న విశ్వసనీయతను, క్రేడిబిలిటీని మరచిపోయి జగన్మోహన్ రెడ్డిని నమ్మడం గురించి మాట్లాడుతున్నారు.

తల్లి చెల్లి నమ్మని జగన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి? అని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. కుటుంబంలోని స్పందన కారణంగా ఉండే విభేదాలను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఎంత మాత్రం నమ్మకాన్ని సంపాదించుకున్నారో.. ఎంత మాత్రం గౌరవాన్ని నిలబెట్టుకున్నారో ఆయన మరచిపోతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో ఆయన చెల్లెలు షర్మిల విభేదించి ఉన్న మాట వాస్తవమే కావచ్చు గాక. మరి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పరిస్థితి ఏమిటి? ఆయన చంద్రబాబు మీద ఆదరాభిమానాలతో మెలగుతున్నారా? అనే ప్రశ్న ప్రజలకు ఎదురవుతోంది.

సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు రాజకీయ జీవితాన్ని చేజేతులా చిదిమేసిన వ్యక్తి చంద్రబాబు. తమ్ముడి రాజకీయ జీవితంతో ఆయన ఆడుకున్న తీరును గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వాడిని అనిపిస్తుంది. అన్నతో షర్మిల విభేదించేనాటికి ఆమెకంటూ స్థిరమైన రాజకీయ జీవితం లేదు. ఆ తర్వాతే రాజకీయ రంగ ప్రవేశం చేసింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచి పనిచేసిన తమ్ముడు రాజకీయ జీవితాన్ని అర్థం గా ముగించేసిన చరిత్ర చంద్రబాబుది.

సొంత తమ్ముడు మాత్రమే కాదు పిల్లను ఇచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న చరిత్ర ఆయనది. షర్మిల జగన్ ను రాజకీయంగా మాత్రమే విమర్శిస్తున్నారు. కానీ ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును పెద్ద ద్రోహిగా కుట్రదారుగా తిట్టిపోశారు.

సొంత మామయ్య ఎన్టీఆర్, చంద్రబాబును తిట్టిన తిట్లు బహుశా మన దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా సొంత కుటుంబం నుంచి ఎదురై ఉండవు. మామయ్య నడిరోడ్డు మీద నిల్చుని చంద్రబాబును నానా తిట్లు తిట్టారు. అలాంటి వంచకుడు మరొకరు ఉండరని అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.

సొంత బావమరిది.. ఆ వంచన భరించలేక విడిపోయి సొంత పార్టీ పెట్టుకుంటే మళ్లీ ప్రలోభపెట్టి తమ జట్టులో కలుపుకున్నారు. వెన్నుపోటులో సహకరించిన తోడల్లుడు ఇప్పటికీ నమ్మకుండా జీవితపర్యంతమూ దూరం పెట్టారు. తన చుట్టూ ఇన్ని పెట్టుకుని.. జగన్ ను కుటుంబ సభ్యులు నమ్మడం గురించి లోకేష్ మాట్లాడడం అనేది చిత్రంగా ఉంది.