ఆయన ప్రకటించేసుకుంటున్నారు!

మనసులో ఉన్న కోరికలను అధికారిక నిర్ణయాలుగా చెప్పేసుకోడం చాలా కామెడీగా ఉంటుంది. అదే సమయంలో.. వేరేవారితో ముడిపడి ఉన్న తమ మనసులోని కోరికలను వారి ప్రమేయం లేకుండా.. నిర్ణయాలుగా ప్రకటించేసుకోవడం ఇంకా ఎక్కువ కామెడీగా…

మనసులో ఉన్న కోరికలను అధికారిక నిర్ణయాలుగా చెప్పేసుకోడం చాలా కామెడీగా ఉంటుంది. అదే సమయంలో.. వేరేవారితో ముడిపడి ఉన్న తమ మనసులోని కోరికలను వారి ప్రమేయం లేకుండా.. నిర్ణయాలుగా ప్రకటించేసుకోవడం ఇంకా ఎక్కువ కామెడీగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ అలాంటి కామెడీనే చేస్తున్నారు.

చంద్రబాబు పల్లకీ మోయడానికి తనకు తోడుగా మోడీ దళాన్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. అనుకుంటే, ఆశపడితే ఓకే.. అయితే నిర్ణయం అయిపోయినట్లుగా మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళుతున్నట్టుగా ఆయన ప్రకటనలు కూడా చేసేస్తుండడమే కామెడీ!

తాజాగా పవన్ కల్యాణ్.. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో మాట్లాడారు. భేటీ తర్వాత పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ విషయం తనకు పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా కూడా ఆయన వెల్లడించారు.

భారతీయ జనతా పార్టీకి సంబంధించి.. అసలు సారథులు, ఆ పార్టీ నాయకులు ఎవ్వరూ ఇప్పటిదాకా నోరు మెదపడం లేదు. అయితే వారి తరఫున కూడా పవన్ కల్యాణ్ పూనిక తీసుకుని పొత్తుల ప్రకటనలను చేసేస్తుండడం గమనార్హం.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల్లో రెండు వర్గాలున్నాయి. చంద్రబాబు భజనకు సిద్ధంగా ఉన్న వర్గం ఒకటి. విముఖంగా ఉన్న వర్గం ఒకటి. చంద్రబాబు పల్లకీమోయాలనుకుంటున్న స్థానిక కమలనాయకులందరూ.. మా అభిప్రాయాలు అధిష్ఠానానికి చెప్పేశాం, ఏ నిర్ణయమైనా హైకమాండ్ తీసుకుంటాంది.. లాంటి మాటలతో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

పురందేశ్వరి సహా తెలుగుదేశం కోవర్టులు ఈ కోవకు చెందుతారు. అదే సమయంలో సోము వీర్రాజు లాంటి  వాళ్లు మాత్రం.. రాష్ట్రంలో భాజపా ఒంటరిగానే మొత్తం 175 స్థానాల్లో పోటీచేస్తుందని, ఈ మేరకు అధిష్ఠానం నుంచి తమకు సమాచారం ఉన్నదని అంటున్నారు.

అసలు ఆ పార్టీ వారితో సంబంధం లేకుండానే.. పవన్ కల్యాణ్ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని చెబుతూ.. కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నారు. చంద్రబాబు పొత్తుల కోసం ఎగబడుతుండగా.. ఢిల్లీ పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారే తప్ప.. ఒపీనియన్ ఇప్పటిదాకా వెల్లడించలేదు. మరి ఈ పొత్తు రాజకీయాలు ఇంకా ఏయే  మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.