చంద్ర‌బాబు ఇంట విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో…

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడి త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఇవాళ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం ఇవాళ ఉద‌యం విష‌మించ‌డంతో, మ‌ధ్యాహ్నం 12:45 గంటలకు ఆయన మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

ఇవాళ ఉద‌యమే రామ్మూర్తినాయుడి ఆరోగ్య ప‌రిస్థితి తెలియ‌డంతో చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి నారా లోకేశ్ త‌న ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ర‌ద్దు చేసుకుని హైద‌రాబాద్‌కు వెళ్లారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆయ‌న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి వుంది. అయితే త‌మ్ముడి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా వుండ‌డంతో మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని హైద‌రాబాద్‌కు రానున్నారు.

ఇదిలా వుండ‌గా 1990లలో టీడీపీలో అత్యంత చురుకైన నేతగా ఉన్న రామ్మూర్తి నాయుడు 1994-99 మధ్య కాలంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు. 2001లో రామ్మూర్తి నాయుడు తన అన్నయ్య చంద్రబాబునాయుడుతో విభేదించి, టీడీపీపై తీవ్ర విమర్శలు చేయ‌డంతో ఆయ‌న్ను పార్టీ నుండి స‌స్పెండ్ చేశారు.

2003 డిసెంబరులో రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో పెద్ద‌గా గుర్తింపు లేక‌పోవ‌డంతో 2006లో తిరిగి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలోకి చేరారు. అనంత‌రం అనారోగ్య కార‌ణంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. రామ్మూర్తినాయుడి త‌న‌యుడు నారా రోహిత్ టాలీవుడ్‌లో హీరోగా ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది.

3 Replies to “చంద్ర‌బాబు ఇంట విషాదం.. రామ్మూర్తి నాయుడు కన్నుమూత!”

Comments are closed.