‘నకిలీ ఖాతాలు’ అందరిదీ ఒకటే పాట!

సోషల్ మీడియా అరెస్టులు ఏపీ వ్యాప్తంగా వెల్లువలా జరుగుతన్న వేళ.. అటు అరెస్టులకు, కేసులకు బలవుతున్నామని ఆవేదన చెందుతున్న వైఎస్సార్ సీపీ కూటమి, వారితో పాటు అధికార కూటమి పార్టీల వారు కూడా ఒక…

సోషల్ మీడియా అరెస్టులు ఏపీ వ్యాప్తంగా వెల్లువలా జరుగుతన్న వేళ.. అటు అరెస్టులకు, కేసులకు బలవుతున్నామని ఆవేదన చెందుతున్న వైఎస్సార్ సీపీ కూటమి, వారితో పాటు అధికార కూటమి పార్టీల వారు కూడా ఒక కొత్త పాట ఎత్తుకున్నారు. తమ పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాల సృష్టి జరుగుతున్నదని.. వాటిద్వారా తప్పుడు పోస్టులు పెడుతున్నారని, తమను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇరుపక్షాల వారు కూడా ఇదే పాటు పాడుతూ ఉండడం విశేషం. ఒకసారి ఫేక్ పేర్లతో ఖాతాలు సృష్టించే వెసులుబాటు ఉన్నప్పుడు.. ఇక ప్రత్యర్థి పేరుతోనే నకిలీ ఖాతా సృష్టించి.. వారి ఖాతాలో తప్పుడు పోస్టులు పెట్టి వారిని ఇరికించడానికి పూనుకోవడం అనేది చిత్రమేమీ కాదు. అయితే.. నకిలీలు అంటూ ఈ నాయకులు చెప్పుకుంటున్నవన్నీ నిజంగా నకిలీలేనా? లేదా, కేసులు బుక్ అయిన తరువాత.. నకిలీ అనే పదం ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నిస్తున్నారా? అనేది అంతుచిక్కడం లేదు.

పోలీసులు నిజాయితీగా, లోతుగా పరిశోధన సాగిస్తే గనుక.. నకిలీ అంటూ ఆవేదన చెందుతున్న వారి మాటల్లో నకిలీ మాటలు ఎన్నో.. నిజాయితీగల మాటలు ఎన్నో సునాయాసంగా నిగ్గుతేల్చగలరు అనేది అందరూ అనుకుంటున్న మాట.

ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నది గనుక.. ఎక్కువగా వైసీపీకి చెందిన వారి మీద కేసులు నమోదు అవుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట నోటీసులు అందుకుంటున్నవారి గురించి, అరెస్టు అవుతున్న వారి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో తెలుగుదేశానికి చెందిన వారి సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే కేసులు కూడా పోలీసు స్టేషన్లలో నమోదు అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీకి చెందిన గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తల పేర్లతో తెలుగుదేశం వారు నకిలీఖాతాలు తెరిచి.. అందులో తెదేపా నాయకుల కుటుంబసభ్యులమీదనే అసభ్య పోస్టులు పెట్టి ఇరికిస్తున్నారని అంటున్నారు. నిజానికి ఇలాంటి వాదనే తెలుగుదేశం వారు కూడా చేస్తున్నారు.

కాకినాడ జిల్లాలో తెలుగుదేశం అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్, అతని అనుచరుల మీద ఒక కేసు నమోదు అయింది. తనమీద గత జనవరి, ఫిబ్రవరిల్లో అసభ్య పోస్టులు పెట్టారంటూ శాంతి అనే వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు రిజిస్టరు చేశారు. ఫేస్ బుక్ లోని మార్ఫింగ్ ఫోటోలపై ఫేస్ బుక్ సంస్థను సంప్రదించామని వారి నుంచి వివరణ రావాలని పోలీసులు అంటున్నారు. ఈలోగా.. మహాసేన రాజేశ్ మాత్రం తన పేరిట ఎవరో నకిలీ ఖాతాలు తెరిచారని, ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ‘నకిలీ ఖాతాలు’ అనే పదం చెప్పేసి తప్పించుకోవాలనుకుంటున్న తరుణంలో పోలీసులు కాస్త లోతుగా తవ్వితే ఆ సంగతి కూడా తేల్చగలరని ప్రజలు ఆశిస్తున్నారు.

One Reply to “‘నకిలీ ఖాతాలు’ అందరిదీ ఒకటే పాట!”

Comments are closed.