అడ్మిషన్ల కోసం ప్రైవేట్ టీచర్లకు టార్గెట్లు పెడతారనే విషయం తెలిసిందే. అయితే కేవలం అడ్మిషన్లు పెంచుకోడానికి, మార్కులు పెంచుకుని తల్లిదండ్రుల్ని మాయ చేయడానికి నారాయణ సంస్థ ఇంత పాపానికి ఒడిగట్టిందని తేలడంతో అందరూ ఛీ కొడుతున్నారు. చీదరించుకుంటున్నారు.
నిజంగానే జనంలో మార్పు వస్తే కచ్చితంగా వచ్చే ఏడాది నారాయణ అడ్మిషన్లు భారీగా తగ్గిపోవాలి. కానీ మాకెందుకులే అని దులుపుకుపోయేవారైతే మాత్రం నారాయణకి వచ్చిన నష్టమేమీ లేదు. మిగతా అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లాగే నారాయణ కూడా యాడ్స్ తో మీడియాని కొనేస్తుంది, రాజకీయ కక్షలంటూ ఆ తప్పుని ప్రభుత్వంపైకి నెట్టేసి తన తని తాను చేసుకుంటూ పోతుంది.
ర్యాంకులన్నీ కొన్నవేనా..?
ఫస్ట్ ర్యాంక్ నారాయణ, సెకండ్ ర్యాంక్ నారాయణ, థర్డ్ ర్యాంక్ నారాయణ.. ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అన్ని ర్యాంకులూ నారాయణవే అనే బోల్డ్ వాయిస్ అడ్వర్టైజ్ మెంట్ అందిరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇదంతా నారాయణ పాపాల ఫలితం అని ఇప్పుడు తేలింది.
కేవలం తల్లిదండ్రుల బలహీనతని ఆసరాగా చేసుకుని అడ్మిషన్లు పెంచుకోడానికి ప్రతి ఏటా ఈ నీచానికి పాల్పడుతోందనే విషయం బయటపడింది. దొడ్డిదారి ర్యాంకులు, మార్కులు తెచ్చుకుని భారీ పబ్లిసిటీ ద్వారా పిల్లల్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాకపోతే దొరికిపోయారంతే.
నారాయణకు కష్టకాలమేనా..?
సహజంగా ఇలాంటి ఆరోపణలు వస్తే ఎలాంటి పెద్ద సంస్థలైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కాలక్రమంలో కనుమరుగైపోయిన సంస్థలు కూడా ఉన్నాయి. నారాయణకు అలాంటి ముప్పు ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.
వాస్తవానికి నారాయణపై తల్లిదండ్రులకు ఇప్పటికే ఒకరకమైన ఏహ్యభావం కలిగింది. కానీ అన్నీ ఆ తానులో ముక్కలేననే భావనతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. కేవలం నారాయణ ఒక్కటే ఈ పాపంలో భాగస్వామి అని తేలితే మాత్రం ఈ విద్యా సంస్థకు ముందు ముందు పెద్ద ముప్పు ఉందనేది మాత్రం ఖాయం.
నాలెడ్జ్ కావాలా.. ర్యాంకులు కావాలా?
నారాయణలో తమ పిల్లల్ని చేర్చాలనుకునే తల్లిదండ్రులు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. తమ పిల్లలకు ర్యాంకులు కావాలా.. నాలెడ్జ్ కావాలా అనేది వాళ్లే నిర్ణయించుకోవాలి. ఎప్పట్లానే మార్కులే కొలమానం అనుకునేవాళ్లు కళ్లుమూసుకొని నారాయణలో చేర్పిస్తారు.
అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. తమ పిల్లలకు అసలైన నాలెడ్జ్ కావాలి, భవిష్యత్తులో వాళ్లకు ఉపయోగపడే చదువు కావాలనుకునే వాళ్లు మాత్రం నారాయణ విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉంది.