Advertisement

Advertisement


Home > Politics - Gossip

పనులు బోలెడు…ప్రచారం జానెడు

పనులు బోలెడు…ప్రచారం జానెడు

ఒకప్పుడు పల్లెల్లో అధికారిక సర్వే చేయించుకోవాలంటే మండల కేంద్రం చుట్టూ తిరగాలి.

విఆర్వో ను కలవాలంటే ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగాలి.

చిన్న చిన్న పనుల కోసం కూడా మండల కేంద్రాలకు పరుగులు తీయాలి.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సచివాలయం అనే ప్రభుత్వ కార్యాలయం పంచాయతీ కేంద్రాలకు వచ్చింది. పనుల అన్నీ సులువుగా జ‌రుగుతున్నాయి. కాదని అనగలరా? ఎవరైనా?

ఒకప్పుడు విత్తనాలు, ఎరువులు కావాలంటే మండల కేంద్రాలకు పరుగెత్తాలి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పల్లెలకు దగ్గరగా వచ్చేసాయి.

వ్యవసాయ నిపుణుల సలహాలు కావాలంటే ఎక్కడికెళ్లాలో తెలియదు. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లోనే అన్నీ లభిస్తున్నాయి.

దాదాపు ప్రభుత్వ స్కూళ్లు అన్నీ కొత్త అందాలు సంతరించుకున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా అందంగా తయారయ్యాయి.

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు అదనపు హంగులు వచ్చాయి. వసతులకు మెరుగులు దిద్దారు. డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు.

అన్ని చోట్లా బయోమెట్రిక్ పద్దతి పెట్టి ఉద్యోగుల పని తీరును చక్కదిద్దారు.

పథకాలు అందించడంలో రాజ‌కీయ దళారీ వ్యవస్థను పక్కన పెట్టి నేరుగా సర్వే చేయిస్తున్నారు. పథకాలు అందిస్తున్నారు.

కానీ బయట ప్రచారం వేరు. జ‌గన్ పాలన అంటే కేవలం జ‌నాలకు డబ్బులు పంచడమే. ప్రతిపక్షాలను కట్టడి చేయడమే. రోడ్ల మరమ్మతులు వదిలేయడమే. ఇలాంటివే ప్రచారాలు. ఇవన్నీ చేసేది ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా. అది వారి పని అనుకోవచ్చు. వారి వారి అస్తిత్వం కోసం ఇలా చేస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.

కానీ మరి ప్రభుత్వం నుంచి నిధులు అందుకుంటున్న ప్రచార పౌర సంబంధాల శాఖ ఏం చేస్తున్నట్లు? రెండు మూడు పత్రికలకు ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తే బాధ్యత తీరిపోయినట్లేనా? స్టేట్ ఫిల్మ్ డివిజ‌న్ ఏమయింది. బలమైన దృశ్య మాధ్యమాన్ని ఎందుకు వాడుకోవడం లేదు. సినిమా థియేటర్లలో ప్రభుత్వ పథకాల డాక్యుమెంటరీలు ప్రసారం చేసే పనులు ఎందుకు చేయడం లేదు? ఎందుకు డాక్యుమెంటరీలు తయారు చేయడం లేదు?

ప్రభుత్వం అనేకానేక పధకాలు అందిస్తోంది. నగదు బదిలీ పధకాలు పక్కన పెడితే ప్రగతి పథకాలు కూడా వున్నాయి కదా? వాటిని ఎందుకు ఫొకస్ చేయలేకపోతోంది. లఘచిత్రాలను తయారు చేయించి థియేటర్లలో ప్రసారం చేయించాలనే కనీస బాధత్యను ఎందుకు విస్మరిస్తోంది? ప్రతిపక్షాలు, వాటి మీడియా, వాటి పని అవి చేసినట్లే, ప్రభుత్వ సమాచార శాఖ దాని పని అది చేయాలి కదా? ఈ శాఖ కోసం సిఎమ్ జ‌గన్ ఓ అధికారిని కోరి మరీ రప్పించుకుని బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ శాఖ పని తీరు చూస్తుంటే అస్సలు ఈ వ్యవహారాలే పట్టనట్లుగా వుంది.

లేనివి చెప్పనక్కరలేదు. జ‌రుగుతున్నవి చెప్పగలిగితే చాలు కదా? కేవలం సోషల్ మీడియా ప్రచారం లేదా ప్రతిపక్ష మీడియా ప్రచారం మాత్రమే పట్టణాలకు చేరుతోంది. మరి ప్రభుత్వ తరపున చెప్పాల్సింది, చూపించాల్సింది కూడా వుంది కదా? ఆ బాధ్యత సమాచార శాఖదే కదా? కొత్త సమాచార శాఖ మంత్రి వచ్చారు. ఆయనైనా ఈ విషయం మీద దృష్టి పెడతారేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?