‘రాజద్రోహం చట్టం’ రద్దు.. వ్యక్తిస్వేచ్ఛకు గౌరవం!

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ గళమెత్తకుండా ఉండాలనే ప్రతి ప్రభుత్వమూ కోరుకుంటుంది. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు ఒక విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, తిరిగి తాము అధికారంలోకి రాగానే.. వ్యతిరేకించిన…

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ గళమెత్తకుండా ఉండాలనే ప్రతి ప్రభుత్వమూ కోరుకుంటుంది. ఇందుకు ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. అధికారంలో లేనప్పుడు ఒక విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, తిరిగి తాము అధికారంలోకి రాగానే.. వ్యతిరేకించిన విషయాన్ని విస్మరించే విషయాలు అనేకం ఉంటాయి. అలాంటి వాటిలో రాజద్రోహం చట్టం రద్దు డిమాండ్ కూడా ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనికోసం పట్టుపట్టే రాజకీయ పార్టీలు అధికారంలోకి రాగానే కన్వీనియెంట్ గా విస్మరిస్తుంటాయి. 

1890 లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించేందుకు అత్యంత దుర్మార్గులైన బ్రిటిష్ పాలకులు తయారుచేసినదే ఈ రాజద్రోహం నేరం 124ఏ సెక్షన్ కింద ఉండే చట్టం. ఈ చట్టాన్ని విచ్చలవిడిగా వినియోగించి అప్పట్లో స్వాతంత్ర్యంకోసం పోరాడుతున్న భారతీయులు వేలాది మందిని జైళ్లలో బంధించారు. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు కూడా ఈ చట్టం బాధితుల్లో ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో ఈ చట్టం ఎంత దుర్మార్గమైనదో ఈ నాయకులే ఈసడించారు. రద్దు చేయాలని నినదించారు. 

కానీ.. నెహ్రూ అధికారంలోకి ఈ చట్టం రద్దు గురించి చాలా కన్వీనియెంట్ గా మరచిపోయారు. తన అధికారాన్ని ప్రశ్నించే వాడిని శిక్షించడానికి ఒక బలమైన కొరడా ఉన్నప్పుడు.. దాన్ని వదులుకోవాలని ఎవరికి మాత్రం ఉంటుంది? అందుకే అత్యంత హేయమైన ఈ చట్టం ఇంతకాలం మనగలిగింది? 

ఎట్టకేలకు 124ఏ సెక్షన్ కింద రాజద్రోహం నేరాలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా.. వారిమీద ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుంటుంది. ఈ చట్టం కింద ప్రస్తుతం దేశంలో 13 వేల మంది జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారంటే.. ఎంత దుర్మార్గమో అర్థమవుతుంది. ఈ చట్టం రద్దు కోసం సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతోంది. ఈ చట్టం ఎట్టకేలకు ఆగిపోయింది. 

ఇప్పుడున్న పరిస్థితులకు ఈ చట్టం పనికిరాదని నిర్ణయించిన రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు దానిని నిలుపుదల చేసింది. ఈ చట్టం కింద ఇకపై కేసులు పెట్టడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. కోర్టుల్లో ఈ సెక్షన్ కింద కేసులు పెండింగ్ లో ఉంటే విచారణ నిలిపేయాలని పేర్కొంది. ఇప్పటికే శిక్షలు అనుభవిస్తున్న వారు.. కోర్టుద్వారా ఉపశమనం పొందడానికి వీలు కల్పించింది. 

మొత్తానికి రాజ్యాంగం ప్రసాదించే అత్యంత ప్రాథమికమైన వ్యక్తి స్వేచ్ఛకు పెను విఘాతంగా ఉన్న రాజద్రోహం చట్టానికి భరతవాక్యం పలికినట్టే. వ్యక్తిస్వేచ్ఛను గౌరవించే దిశగా ఇది పెద్ద ముందడుగు. అలాగే.. ఇదే తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘తయారు చేసుకున్న’ అనేక ఇతర చట్టాల గురించి కూడా చర్చ జరగవలసి ఉన్నది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని, ప్రభుత్వాలు, రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి, ప్రజల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. 

124ఏ సెక్షన్ రద్దు అనేది ఒక అడుగు మాత్రమే. ఈ దిశగా ఇంకా అనేక అడుగులు పడాల్సిన అవసరం ఉంది.