వైఎస్ కొండారెడ్డి….గత మూడు రోజులుగా వార్తల్లో వ్యక్తి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వరుసకు సోదరుడు. కొండారెడ్డిని జిల్లా బహిష్కరణ కోసం కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజ్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపడం సంచలనం కలిగిస్తోంది. నేడోరేపో కొండారెడ్డికి సంబంధించి వైఎస్సార్ జిల్లా బహిష్కరణ ప్రకటన రావచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకే కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ చర్య చేపట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదే సందర్భంలో వైఎస్ కొండారెడ్డిని వైసీపీ నుంచి సాగనంపనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్‌చార్జ్. ఒకప్పుడు ఇడుపులపాయ ఎస్టేట్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. వైఎస్ కొండారెడ్డి వ్యవహారశైలిపై మొదటి నుంచి విమర్శలున్నాయి. తన, మన అనే తేడా లేకుండా దురుసుగా మాట్లాడ్తారనే ఫిర్యాదులెన్నో. అయినప్పటికీ ఏనాడూ ఆయనపై చర్యలు లేవు.
కారణాలేవైనా ప్రస్తుతం వైఎస్ కొండారెడ్డిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కన్నెర్ర చేశారు. చాగలమర్రి – రాయచోటి రహదారి పనులను చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ ఉద్యోగులపై బెదిరింపులకు దిగడం, రాజంపేట, కడప ఎంపీలను ఇష్టానుసారం తిట్టడంతో వైఎస్ కొండారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోక తప్పలేదు. బెదిరింపుల కేసులో జైలుకు పంపారు. అంతకు మించి చర్యలు ఉండవని అంతా భావించారు.
అయితే జిల్లా బహిష్కరణకు ప్రతిపాదనలు పంపడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే సందర్భంలో వైఎస్ కొండారెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలో కొనసాగిస్తే ఏం మర్యాద వుంటుందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. జిల్లా నుంచి బహిష్కరించే క్యారెక్టర్ పార్టీకి ఎలా దోహదం చేస్తుందని వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
చక్రాయపేట మండల వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఎలా కొనసాగిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం ఏం చెబుతామని వైసీపీలో అంతర్మథనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ కొండారెడ్డిని పార్టీ నుంచి సాగనంపి, శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. వైసీపీ నుంచి బహిష్కరణపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.