మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల కారు డ్రైవర్ వలీబాషా ముసుగు డ్రామా రక్తి కట్టలేదు. కడప విడిచి వెళ్లాలని ముసుగు ధరించిన ఆగంతకులు తనను బెదిరించినట్టు సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని కడప పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుగా విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దస్తగిరి అప్రూవర్‌గా మారి, పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో వైసీపీ కీలక నేత, కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఇదిలా వుండగా కేసు ముగింపు దశలో సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ వలీబాషా ఫిర్యాదు చర్చనీయాంశమైంది.
ఈ నెల 8న కడపలోని హరిత హోటల్ నుంచి జీత్ పంజాబ్ దాబాకు వెళుతుండగా పాత బైపాస్ రోడ్డు సమీపంలోని పద్మావతి వీధిలో ఓ ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి తన కారుకు అడ్డంగా వచ్చాడని పేర్కొన్నాడు. తనను బెదిరించినట్టు డ్రైవర్ వలీబాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కడప విడిచి వెంటనే వెళ్లకపోతే బాంబు వేసి పేల్చేస్తామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీబీఐ అధికారులు కూడా వెళ్లిపోవాలని అందరూ చూస్తుండగానే హెచ్చరించినట్టు ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం సృష్టించింది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు ఎంతో ప్రత్యేకత వుంది. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి వచ్చాయి. వివేకా హత్య కేసు వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీసుకొచ్చింది. వివేకా కుమార్తె డాక్టర్ సునీత తండ్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడేలా చేసేందుకు వీరోచిత పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది.
డ్రైవర్ ఫిర్యాదుపై కడప పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం సీసీటీవీ పుటేజీలను సేకరించి సమగ్రంగా విశ్లేషించారు. అయితే ఎక్కడా కారుకు అడ్డొచ్చినట్టు ఆధారాలు లభించలేదని తెలిసింది. జీత్ పంజాబ్ దాబాతో పాటు ఆ వాహనం మళ్లీ హరిత హోటల్‌కు వెళ్లేంత వరకూ ఉన్న సీసీటీవీ పుటేజీలను కడప పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినట్టు సమాచారం. కానీ కారుకు అడ్డంగా రావడం, బెదిరించడం లాంటి వాటికి ఆధారాలు లభించలేదని తెలిసింది. అలాగే స్థానికులను కూడా పోలీసులు విచారించినట్టు తెలిసింది.
వారి నుంచి కూడా డ్రైవర్ చెబుతున్నట్టుగా ఆధారాలు దొరకలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించి, ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపినట్టు సమాచారం. కీలకమైన కేసుకు సంబంధించి సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ ఎందుకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు? ఆయన వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.